ఐపీఎల్ బయో బుడగలోకి కరోనా వైరస్ ప్రవేశించడం, వరుసగా ఆటగాళ్ళు, సహాయ సిబ్బంది వైరస్ బారిన పడడంతో ఐపీఎల్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెల్సిందే. అయితే ఆటగాళ్ళు కరోనా బారిన పడడం, టోర్నీ రద్దు చేయడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. ఐపీఎల్ బుడగ బలహీనంగా మారేందుకు బహుశా ప్రయాణాలే కారణం కావొచ్చని గంగూలీ అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. ఇక బయో బుడగలో ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందో తనకు తెలియదని… దీనికి సంబంధించి పూర్తి కారణాలపై విశ్లేశిస్తున్నామని అన్నారు.
ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ సిరీస్‌ను విజయవంతం చేసినప్పుడు కోవిడ్ కేసుల సంఖ్య నియంత్రణలోనే ఉందని గుర్తు చేసారు. ఇక ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ముందు కూడా దేశంలో కరోనా వ్యాప్తి అంతగా లేదని… కేసుల సంఖ్య కూడా అత్యంత తక్కువగా ఉందని అన్నారు. ముంబయిలో కోవిడ్ విజృంభణ ఉన్నప్పటికీ అక్కడ మ్యాచ్ లను విజయవంతంగా ముగించామన్నారు. విదేశీ ఆటగాళ్లు వారి స్వదేశానికి చేరుకొనేందుకు ఎలాంటి ఇబ్బందుల్లేవన్న దాదా… ఆసీస్ క్రికెటర్లు మొదట మాల్దీవులకు చేరుకొని అక్కడ క్వారంటైన్ పూర్తయ్యాక స్వదేశానికి వెళ్తారని తెలిపారు. గతేడాది ఐపీఎల్ సమయంలో దుబాయ్‌లో బుడగను చూసుకున్న రీస్ట్రాటాకు భారత్‌లో అనుభవం లేదని అందుకే మరో సంస్థకు బాధ్యతలు అప్పగించాల్సి వచ్చిందని వెల్లడించారు.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ను దుబాయ్‌లో నిర్వహించడంపై కథనాలు వస్తున్ననేపథ్యంలో దీనిపై ఇప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుందని అన్నారు. టీ20 వరల్డ్ కప్‌కు ఇంకా సమయం ఉందని తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి దానిపై ఇప్పుడే మాట్లాడడం కష్టమని అన్నారు. ఇంగ్లాండ్‌లో జరగాల్సిన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని, భారత క్రికెటర్లు ఇంగ్లాండ్‌లో వారం రోజులు క్వారంటైన్‌లో ఉంటారని తెలిపారు.