విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మొట్టమొదటిగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ సమర్పించిన గంటా శ్రీనివాసరావు ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఇప్పుడు ముగిసిన అధ్యాయం అని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద రాష్ట్రానికి కేంద్రం నుంచి సమాచారం ఉందని ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నామని నిర్మల సీతారామన్ నిన్న స్పష్టం చేశారని అన్నారు. అయినా తమకు ఏమీ తెలియదు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.
స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు ఇకనైనా సీఎం జగన్ ప్రధాన పాత్ర తీసుకోవాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద ఇప్పటికే చంద్రబాబు కూడా ప్రధానికి లేఖ రాశారని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద స్పందించాలని గంటా కోరారు. ఇక బడ్జెట్ సమావేశాల్లో కచ్చితంగా నా రాజీనామా ఆమోదింప చేసుకుంటామని ఆయన అన్నారు. ఇక ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద బీజేపీ నేతలు ఇప్పటికైనా మాయమాటలు ఆపాలని అన్నారు.