ఏమాటకామాట చెప్పుకోవాలంటే… అధికారంలేకపోతే గంటా శ్రీనివాస్ ఉండలేరు! పాపం అధికార పార్టీలో ఉంటేనే ప్రజలకు సేవ మరింత ఎక్కువ చేయొచ్చనే ఆలోచన కాబోలు! విలువలు, వలువలు వంటి పాతచింతకాయపచ్చడి కబుర్లు ఆయనకు నచ్చవు! అధికారంలో ఏ పార్టీ ఉంటే అది ఆయన సొంత పార్టీ… ఆ పార్టీని ఆయన అధికారంలో ఉన్నన్నాళ్లు అమ్మలా చూసుకుంటారు! ఇందులో భాగంగా శనివారం వైకాపాలో గంటా చేరబోతున్నారని తెలుస్తోంది!
అవును… బాబును ఇంతకాలం టెన్షన్ పెట్టి పెట్టి ఆఖరికి ఫైనల్ వర్డ్ చెప్పేయబోతున్నారు గంటా శ్రీనివాస్! అన్నీ అనుకూలంగా జరిగితే శనివారం జగన్ తో ప్రత్యేకంగా భేటీ అవ్వనున్నారు గంటా. అదే రోజు మెడలో వైకాపా కండువా వేసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి అధికారపార్టీలోకి వస్తున్నందుకు ఆయన పార్టీకి ఏమిచ్చుకుంటున్నారు అనేది ప్రస్తుతానికి తెలియదు కానీ… పార్టీ మాత్రం ఆయనకు బలమైన ఆఫరే ఇచ్చిందంట!
అక్టోబర్ 3న సీఎం జగన్తో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న అనంతరం… వీ.ఎం.ఆర్.డీ.ఏ చైర్మన్ గా బయటకు వస్తారని అంటున్నారు!! అంతవరకూ బాగానే ఉంది కానీ… గంటా వైకాపాలోకి వచ్చిన తర్వాత అవంతి, విజయసాయిలను తట్టుకోగలుగుతారా లేక వారికే ఏకులా వచ్చి మేకై దిగుతారా అన్నది వేచి చూడాలి!!
-CH Raja