ఆంధ్రప్రదేశ్ లో బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ నేతలు వరుసగా షాక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా బలహీనంగా ఉన్న సమయంలో జెండాలు మారుస్తూ అధినేతను, పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల వ్యవహారశైలి చంద్రబాబుకి కూడా ఇబ్బందిగా మారిన సంగతి తెలిసిందే. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలయింది. ఆ పార్టీ నేతలు కొందరు వైసీపీకి బహిరంగానే మద్దతు పలకడంతో ఉత్తరాంధ్ర, రాయలసీమలో పార్టీ కాళీ అవుతుందనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించాయి.
వీరిలో గంటా శ్రీనివాసరావు పేరు ప్రధానంగా వినిపించింది. ఆయన జగన్ నిర్ణయాన్ని స్వాగతించడంతో పార్టీ మారడం ఖాయమని భావించారు అందరూ. దీనిపై గంటా తాజాగా స్పష్టత ఇచ్చారు. విశాఖలో ఆయన మేడితో మాట్లాడుతూ… తాను పార్టీ మారే అవకాశం లేదని, పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేసారు. విశాఖలో రాజధాని పెట్టడాన్ని స్వాగతిస్తున్నానని మరోసారి ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఆయన, రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి ఆయన డిమాండ్ చేసారు. విశాఖలో రాజధాని వస్తే శాంతిభద్రతలు లోపిస్తాయన్న భయాందోళనలను ప్రభుత్వం తొలగించాలని ఆయన హితవు పలికారు. అమరావతి రైతులకు మద్దతుగా నిలవాలన్న పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటానని గంటా స్పష్టం చేసారు. వాస్తవానికి ఆయన పార్టీ మారతారనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించాయి. వైసీపీ నేతలు కూడా మున్సిపల్ ఎన్నికలకు ముందు ఆయన పార్టీ మారితే తమకు కలిసి వస్తుందని భావించారు. ఈ తరుణంలో గంటా వైసీపీకి షాక్ ఇచ్చారు.