మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ విషాదం నింపింది.ఎన్నడూ లేనంతగా ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.ఇవాళ ఆయన పార్థివ దేహాన్ని హైద్రాబాద్ భేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో నెల్లూరు జిల్లాకు తరలిస్తారు. అక్కడే ఉదయగిరి మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణాన అంత్యక్రియలను రేపటి వేళ చేయనున్నారు.మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు ఈ ఉదయం ఇండియాకు చేరుకోనున్నారు. యూఎస్ లో ఉన్న ఆయన హుటాహుటిన బయలుదేరారు.ఆయన వచ్చాకే అంత్య క్రియల నిర్వహణ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ పెద్ద సజ్జల రామకృష్ణా రెడ్డి అంటున్నారు. అంత్య క్రియలకు సీఎం జగన్ తో పాటు ఇరు రాష్ట్రాలకూ చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
ఇక ఎప్పుడూ ఫిట్నెస్ తో ఉండే మంత్రి గౌతమ్ రెడ్డి మరణించిన విషయాన్ని తాము నమ్మలేకపోతున్నామని పలువురు రాజకీయ నాయకులు అంటున్నారు.ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. వేళ తప్పకుండా వ్యాయామం,వేళ తప్పకుండా ఆహారం తీసుకునే ఆయన గుండె పోటు తో అకస్మాత్తుగా మరణించారంటే అంతా ఓ కల మాదిరి ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.చిన్న వయసులోనే లోకాన్ని విడిచిపోవడం ఎంతైనా బాధాకరం అని అంటున్నారు.
మంత్రి గౌతమ్ రెడ్డి మరణాన్ని,కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో పోల్చి చూస్తున్నారు.ఆయన కూడా ఇలానే వర్కౌట్స్ చేస్తూనే మరణించారని, అదేవిధంగా ఉదయం వేళల్లో కార్డియాటిక్ అరెస్ట్ కారణంగానే ఈ ఇద్దరి ప్రాణాలూ దక్కలేదని కొందరు చెబుతున్నారు.ఇద్దరు కూడా ఇంచుమించు ఓకే వయస్సు ఉన్నవారే అని, ఇద్దరికీ ఫిట్నెస్ పై మంచి శ్రద్ధ ఉందని అంటూ.. పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ కారణంగానే మంత్రి చనిపోయి ఉంటారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమయినప్పటికీ వ్యాయామాలు అన్నవి ఫిట్నెస్ ట్రైనర్ పర్యవేక్షణలోనే చేయాలని,అతిగా చేయకూడదు అని, వ్యాయామం తరువాత శరీరంలో వచ్చే మార్పులు గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. మంత్రి గౌతమ్ రెడ్డి విషయమై వ్యాయామం తరువాత శరీరంలో వచ్చిన మార్పులు కారణంగానే ఆయన చనిపోయి ఉంటారన్న వాదన కూడా వినిపిస్తోంది.