విభిన్నం అయిన ధోరణి.పెద్దగా ప్రసార మాధ్యమాల్లో కనిపించని వైనం.మాట్లాడిన తగ్గని హుందాతనం.మంచి భాషకు ప్రాధాన్యం ఇవన్నీ మేకపాటి గౌతం రెడ్డికి ఆభరణాలు.ఆయన పరిశ్రమల శాఖతో పాటు ఐటీ శాఖను కూడా నిర్వహిస్తున్నారు.ఏపీ,తెలంగాణ పరిణామాలపై,పారిశ్రామిక ప్రగతి పై మంచి అవగాహన ఉన్న నేత ఆయన. మిగతా మంత్రుల మాదిరిగా మీడియా ముందుకు హల్చల్ చేయరు.వివాదస్పద వ్యాఖ్యలు చేసి తన స్థాయిని ఇప్పటిదాకా తగ్గించుకోలేదు.బాగా చదువుకున్నవాడు కావడంతో అదే పద్ధతి,నడవడితోనే రాజకీయ రంగంలో ఉన్నారు.వైసీపీ రాజకీయాల్లో ఆయన తప్ప ఎవ్వరూ ఇంత హుందాగా మాట్లాడిన వారు లేరు అని చెప్పడం అతిశయం అయితే కాదు.
గత నెల కరోనా బారిన పడి తరువాత కోలుకున్న మేకపాటి గౌతం రెడ్డి ఆకస్మిక మరణం వైసీపీలో విషాదం నింపింది. నెల్లూరు రాజకీయాలను శాసించే స్థాయి ఉన్న కుటుంబం నుంచి వచ్చినా ఆ స్పీడు ఆయన వ్యవహార శైలిలో ఉండదు.మొదట్నుంచి సౌమ్యులు.వివాదరహితులు.ఉన్నత విద్యావంతులు.వారికి మనలోకం తరఫున నివాళి ఇస్తూ.. ఈ ప్రత్యేక కథనం.
నెల్లూరుకు చెందిన ఈయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి వారసత్వాన్ని అందుకుని ఇటుగా రాజకీయాల్లోకి వచ్చారు.తండ్రి ఎంపీగా పనిచేశారు.వైసీపీలో కీలకంగా కనిపించే నేత.వైఎస్ జగన్ వెంట మొదట్నుంచి నడిచిన కుటుంబం మేకపాటి కుటుంబం. అత్యంత విధేయులుగా వీరికి పేరుంది.నెల్లూరు రాజకీయాల్లో ఈ కుటుంబానికి తిరుగులేని చరిష్మా ఉంది.జగన్ అధికారంలోకి వచ్చాక కీలకం అయిన పరిశ్రమలు,ఐటీ శాఖను నిర్వహిస్తున్నారు.వివాదాలకు దూరంగా ఉండడమే కాదు అందరినీ కలుపుకుని పోయే తత్వం ఉన్న నేతగా పేరున్నవారు.ముఖ్యంగా కొత్త పరిశ్రమలకు ఊతం ఇచ్చేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని జగన్ తలపించిన విధంగానే ఈయన పనిచేశారు.ఆయన ఆలోచనలకు చాలా సందర్భాల్లో ఆచరణ రూపం ఇచ్చారు.
ఇదీ ఆయన నేపథ్యం
– 1971 నవంబర్ 2న జన్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంగ్లండ్ లోని మాంఛెస్టర్ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు.