మూడు దశాబ్దాలుగా అక్కడ ఆ కుటుంబానిది తిరుగులేని ఆధిపత్యం. మొన్నటి ఎన్నికల్లో పెద్దాయన పోటీ నుంచి తప్పుకుని వారసురాలికి బాధ్యత అప్పగిస్తే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఏడాదిన్నరగా అన్నింటికీ దూరంగా ఉన్న ఆ కుటుంబం ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగుతోంది. ఉద్ధానం, సోంపేట, పలాసలో ఉన్న పట్టుని మళ్లీ నిలబెట్టుకుంటుందా గౌతు వారసురాలి సత్తా ఎంత అన్నదాని పై ఇప్పుడు సిక్కోలు టీడీపీలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.
శ్రీకాకుళం జిల్లా రాజకీయ చిత్రంలో గౌతు కుటుంబానికి ప్రత్యేకస్థానం ఉంది. ఉద్ధానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చరిత్ర గౌతు లచ్చన్నది. అదే వారసత్వాన్ని ఆయన తనయుడు గౌతు శివాజీ కొనసాగిస్తూ.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సోంపేటను కేంద్రంగా చేసుకున్నారు. కానీ.. 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సోంపేట కాస్తా ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలుగా విడిపోవడంతో శివాజీ పలాసను ఎంచుకున్నారు.
2009 ఎన్నికల్లో ఓడిన శివాజీ.. 2014లో గెలిచారు. 2019లో ఆయన తప్పుకొని కుమార్తె గౌతు శిరీషను బరిలో దించారు. కానీ.. పరాజయమే పలకరించింది. సీదిరి అప్పలరాజు చేతిలో ఓడిపోయారు. ఓటమి ఎఫెక్టో ఏమో కానీ.. శిరీష కుటుంబం పలాసను వదిలేసి విశాఖ వెళ్లిపోయింది. శివాజీ సోంపేటకే పరిమితం అయ్యారు. గౌతు కుటుంబం చురుకుగా లేకపోవడంతో వారి అనుచరులు, టీడీపీ శ్రేణులు అనాథలయ్యాయి. అయితే అధికార పార్టీ ఒత్తిళ్లు తట్టుకోలేక అంతా సైలెంట్ అయిపోయారు.
అజ్ఞాతవాసం పూర్తయిందో ఏమో కానీ.. గౌతు ఫ్యామిలీ మళ్లీ యాక్టివ్ అయిందట. మొన్నటి వరకు జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ పలాసపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు శిరీష. ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా కూన రవికుమార్ రావడం.. శిరీష టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావడంతో ఈక్వేషన్స్ మారిపోయాయని అనుకుంటున్నారు. పైగా టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా జిల్లాకే చెందిన అచ్చెన్నాయుడు రావడంతో.. ఆయన సొంత జిల్లాను చక్కబెట్టే పనిలో పడ్డారట. ఆ క్రమంలోనే పోయినచోటే వెతుక్కోవాలన్నట్టు పలాసపై దృష్టి పెట్టారట శిరీష.
కూన రవికుమార్, అచ్చెన్నాయుడుల అండతో పలాసలో పట్టు నిలుపుకొనేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు శిరీష. ప్రజా సమస్యలే మా సమస్యలు అని పలాసలో ప్రత్యక్షం అవుతున్నారు. మంత్రి అప్పలరాజుకు వ్యతిరేకంగా ఉన్న అంశాలను అనుకూలంగా మలుచుకునే పనిచేస్తున్నారట. మత్స్యకార భరోసా, మత్స్యకార భృతి, సబ్సిడీ డీజిల్ గోల్‌మాల్‌పై స్వరం పెంచారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పసుపు జెండా ఎగరేస్తే నియోజకవర్గంలో తిరిగి పట్టు లభిస్తుందని లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం.
అయితే ప్రస్థుతం అప్పలరాజు ఎమ్మెల్యే మాత్రమే కాదు.. మంత్రి కూడా. పైగా అధికార పార్టీ శ్రీకాకుళంలో బలంగా ఉంది. మరి.. ఈ ప్రతికూల రాజకీయ వాతావరణంలో గౌతు కుటుంబం ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.