ఆ మంత్రి,ఎమ్మెల్యే తరచూ వివాదాలతో పార్టీకి తలనొప్పిగా మారారా

-

ఒకరు మంత్రి.. మరొకరు ఎమ్మెల్యే. వివాదాలు కోరుకుంటున్నారో లేక వివాదాలు వారినే వెతుక్కుంటూ వస్తున్నాయో కానీ.. తలనొప్పిగా మారారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మంత్రి మల్లారెడ్డి…పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అధికార పార్టీకి చెందిన ఈ ఇద్దరు నాయకులు ఒకేరోజు హాట్‌ టాపిక్‌గా మారారు. వాడీవేడీ చర్చకు కారణమయ్యారు. వారు ఏం చేసినా వివాదం కలిసే ఉంటుందన్న నానుడిని రుజువు చేశారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

మల్లారెడ్డి మంత్రి కాకముందు ఎలా ఉండేవారో.. మంత్రి అయ్యాక కూడా అలాగే ఉంటున్నారన్నది టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్పేమాట. ప్రత్యర్థి పార్టీ నాయకులపైనే కాకుండా సహచర పార్టీ నేతలపైనా నోరు పారేసుకోవడానికి ఆయన ఏ మాత్రం వెనకాడరు. ప్రస్తుతం ఓ భూ వివాదంలో చిక్కుకున్నారు మంత్రి. మల్లారెడ్డి నుంచి ప్రాణహాని ఉందని ఏకంగా మానహహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు శ్యామల అనే మహిళ. దీంతో మల్లారెడ్డితోపాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేయక తప్పలేదు.

వివాదం ఉన్న చోటుకు ఆయన వెళ్తారో లేక నిత్యం వివాదాల్లో ఉండి ప్రజల నోళ్లలో పేరు నలగాలని కోరుకుంటారో కానీ మల్లారెడ్డి ఎప్పుడూ హాట్ టాపిక్కే. మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ టికెట్‌కు కోటి డిమాండ్‌ చేశారన్న ప్రచారం జరిగింది. ఆడియో టేపులు దుమారం రేపాయి. ఇటీవల హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో రేవ్‌పార్టీ చేసుకుంటూ కొందరు పోలీసులకు చిక్కారు. వారిలో మల్లారెడ్డి మేనల్లుడు రఘువీర్‌రెడ్డి ఉండటంతో.. అతడిని కేసు నుంచి బయట పడేసేందుకు పోలీసులపై మంత్రి తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. ఆ వేడి చల్లారకముందే భూ కబ్జా ఆరోపణలు తెరమీదకు వచ్చాయి.

ఇక పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అనేక పార్టీలు తిరిగి చివర్లో టీఆర్‌ఎస్‌లో కుదురుకున్నారు. 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలిచారు. నిత్యం వివాదాలలో ఉండటంలో మహిపాల్‌రెడ్డిది పెట్టింది పేరంటాయి టీఆర్‌ఎస్‌ వర్గాలు. బెదిరింపులు.. డబ్బులు వసూళ్ల విషయంలో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. పైగా ఆయన కుమారుడు కూడా పటాన్‌చెరు ఏరియాలోని పరిశ్రమల నుంచి వసూళ్లకు పాల్పడతారనే ఆరోపణలు చేస్తుంటాయి ప్రత్యర్థి పార్టీలు. ప్రస్తుతం తనకు వ్యతిరేకంగా వార్త రాశాడని ఓ విలేకరిని ఎమ్మెల్యే ఫోన్‌లో బెదిరించడం కలకలం రేపుతోంది. పార్టీ పెద్దలు కూడా ఈ వివాదంపై ఫోకస్‌ పెట్టారని సమాచారం.

పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డితో కూడా ఎమ్మెల్యేకు పడదని చెబుతారు. గ్రేటర్ ఎన్నికల్లో భూపాల్‌రెడ్డి కోడలు సింధుఆదర్శరెడ్డి పోటీ చేశారు. ఆమెను మేయర్‌ అభ్యర్థిగా ప్రొజెక్ట్‌ చేయడంతో.. పటాన్‌చెరులో మరో పవర్‌ సెంటర్‌ ఉండకూడదని భావించిన మహిపాల్‌రెడ్డి .. సింధూరెడ్డి ఓటమికి ప్రయత్నం చేశారని టీఆర్‌ఎస్‌ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పెద్దలకు చెప్పడంతో.. వారు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారట. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాత్రం ఇలాంటి ఆరోపణలను ఖండిస్తున్నారు. ఈ వివాదాలలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిల వాదన ఎలా ఉన్నా.. పార్టీ పెద్దల ఆలోచన మాత్రం మరోలా ఉందట. మరి.. ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news