గ్రేటర్ లో మళ్లీ రాజకీయ వేడి..కార్పోరేటర్లలో కొత్త టెన్షన్

-

గ్రేటర్ మేయర్ ఎన్నికకు రంగం సిద్దమవుతుంది. ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం తేదీ కూడా ఫిక్స్‌ కావడంతో ఇన్నాళ్లూ నెలకొన్న ఆందోళన తొలిగిపోయింది. ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారైన వేళ కార్పోరేటర్లలో మరో అంశం గుబులు రేపుతుందట..మొన్నటి వరకు గెజిట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా ప్రమాణం ఎప్పుడు చేద్దామా అని ఎదురు చూసిన నేతలు..ప్రమాణ స్వీకార తేదిని చూసి టెన్షన్ పడుతున్నారట….

GHMC elections 2020 live updates – manalokam.com

జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌తోపాటు విధానపరమైన సూచనలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నిర్ణయంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ నూతన పాలకమండలి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో గెలిచిన వారి జాబితాతో గెజిట్‌ ప్రకటించడంతో తదుపరి చర్యలు.. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలపై ఎస్ఈసీ దృష్టి పెట్టింది.

గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చినా ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంతో హంగ్‌ ఏర్పడింది. ఎక్స్‌అఫీషియో ఓట్లను కలుపుకొన్నా లెక్క తేలకపోవడంతో కొత్త పాలకవర్గం కొలువు తీరలేదు. దీంతో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జోలికి పోకుండా.. పాత పాలకవర్గం గడువు ముగిసేవరకు ఈ అంశం కొలిక్కి రాదనే అభిప్రాయానికి వచ్చాయి పార్టీలు. 150 డివిజన్ల నుంచి కొత్త కార్పొరేటర్లు గెలిచి ప్రమాణస్వికారానికి సిద్దమైన వేళ కొత్త పాలకమండలికి ఎన్నికల సంఘం ఫిక్స్ చేసిన ముహుర్తం టెన్షన్ పెడుతుందట.

పాత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉంది. అందుకే ఫిబ్రవరి 11న కొత్త పాలకమండలి ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఫిబ్రవరి 11 అనగానే గెలిచిన కార్పొరేటర్లలో చాలా మందికి గుండెల్లో రాయిపడిందట. ఫిబ్రవరి 11 అమావాస్య కావడంతో ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి చాలా మంది కార్పొరేటర్లు వెనకంజ వేస్తున్నారట. అమావాస్య రోజు కొత్త పనులకు ఎలా శ్రీకారం చుడతామని ప్రశ్నిస్తున్నారట.
ఇది ఆ నోటా..ఈ నోటా రాష్ట్ర ఎన్నికల సంఘం చెవిని పడిందట. ఇప్పటికే డేట్ ఫిక్స్‌ చేసినందున దానిని రీ షెడ్యూల్‌ చేయడం కుదరబోదని ఎస్ఈసీ వర్గాల చెబుతున్నాయి. ఒకవేళ ఫిబ్రవరి 11న ప్రమాణ స్వీకారం చేయడం ఇష్టం లేకపోతే ఆ రోజు కార్పొరేటర్లు గైర్హాజర్‌ కావొచ్చు. కోరం లేకపోతే సమావేశాన్ని మరో రోజుకు వాయిదా వేసుకునే వెసులుబాటు ఉంటుంది అని వెల్లడిస్తున్నాయి.

అమావాస్య అభ్యంతరం ఒక్క బీజేపీ కార్పొరేటర్లకే కాదు.. టీఆర్‌ఎస్‌లోని కార్పొరేటర్లు సైతం ఉందట. అందుకే ఫిబ్రవరి 11న ఎంత మంది ప్రమాణ స్వీకారానికి వస్తారు..ఎంత మంది గైర్హాజర్‌ అవుతారు అని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఒకవేళ కోరం ఉంటే.. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కూడా చేపడతారు. అందుకే అమావాస్య రోజున భేటీ ఏర్పాటు చేయడంలో రాజకీయ ఎత్తుగడ ఏదైనా ఉందా అని కొందరు ఆరా తీస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news