బ్యాలెట్‌తోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు…?

-

గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నిర్వ‌హ‌ణ‌పై ఎట్ట‌కేల‌కు అధికారులు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలిసింది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ ద్వారా నిర్వ‌హించాలా… లేక ఈవీఎంల ద్వారా నిర్వ‌హించాలా.. అన్న దానిపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తుద‌కు గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌ను బ్యాలెట్‌ ద్వారానే నిర్వహించాలని అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆ దిశగా ఏర్పాట్లూ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ సహా మెజారిటీ పార్టీలు బ్యాలెట్‌ పోలింగ్‌ నిర్వహించాలన్న అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఈ క్రమంలో ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి బ్యాలెట్‌ బాక్సులు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయ‌ని అధికారులు వెల్ల‌డించారు. ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు జీహెచ్‌ఎంసీ లేఖ కూడా రాసినట్టు ఓ అధికారి చెప్పారు. తెలంగాణలో కార్పొరేషన్‌, మునిసిపల్‌ ఎన్నికలు ముగిసిన అనంతరం ఇక్కడి 29 వేల బ్యాలెట్‌ బాక్సులను స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఏపీ ఎన్నికల సంఘం తీసుకెళ్లింది. కొవిడ్‌ విజృంభణ, కోర్టుల్లో పిటిషన్‌లు వేయడంతో ఏపీలో ఎన్నికలు వాయిదా పడ్దాయి. ఏపీ నుంచి బ్యాలెట్‌ బాక్సులను తిరిగి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. మొత్తంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు అందుబాటులో లేకపోవడంతో అధికారులు బ్యాలెట్‌ వైపు మొగ్గు చూపిన‌ట్లు తెలుస్తుంది. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారికంగా నిర్ణయం వెలువడనున్నట్లు స‌మాచారం.
కాగా గ్రేటర్‌లోని 150 డివిజన్లలో 11,500 నుంచి 12 వేల పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటుచేసే అవకాశముంది. ఒక్కో బూత్‌కు అభ్యర్థుల సంఖ్యను బట్టి రెండు లేదా మూడు బ్యాలెట్‌ బాక్సులు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news