హైదరాబాద్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే మధుర గీతాలే గుర్తొస్తాయి. తెలుగులోనే కాదు అన్ని భాషల్లో నలభైవేలకు పైగా పాటలు పాడిన మహా గాయకుడు. కరోనాతో బాలసుబ్రహ్మణ్యం మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చ లేనిది. బాలసుబ్రహ్మమణ్యం 75వ పుట్టినరోజు సందర్బంగా తెలుగు చిత్రసీమ ఆయనకు ఘన నివాళులర్పించింది. శుక్రవారం ‘ఎస్పీ బాలుకు స్వరనీరాజనం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి, సూపర్‌స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్, ఎస్పీ చరణ్, కళాతపస్వి కే విశ్వనాథ్, దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, డైలాగ్ కింగ్ సాయికుమార్, జీవితారాజశేఖర్, ఆర్పీపట్నాయక్, కేఎల్ దామోదర్ ప్రసాద్, ఎన్ శంకర్, ప్రసన్నకుమార్, నిర్మాత ఆచంట గోపినాధ్, రచయితలు అనంత్ శ్రీరామ్, జేకే భారవి, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘బాలు అన్నయ్యతో నాకు 1980 నుంచి సాన్నిహిత్యం ఉంది. కుటుంబ పరంగా, సినిమా పరంగా బాగా దగ్గరగా ఉండేవాళ్లం. నేను బాలు అంటే ఆయనకు నచ్చదు. అన్నయ్య అని పిలవమనేవారు. నా సినిమా పాటలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఆయన గాత్రానికి నా బాడీ లాంగ్వేజ్ మ్యాచ్ చేసేందుకు చాలా కష్టపడ్డా. నా సినిమా జీవితంలో నా సక్సెస్‌కి బాలు సగం దోహదపడ్డారు. స్టాలిన్, శంకర్ దాదా ఎంబీబీఎస్ వరకు ఆయన నా సినిమాలకు పాడారు. అందుకే నా సక్సెస్‌లో ఆయనకు సగభాగం ఇస్తా. నన్ను కమర్షిల్ సినిమాలే కాకుండా కళాత్మక సినిమాలు కూడా చేయమని చెప్పేవారు. కానీ అలాంటి సినిమాలు చేస్తే నాకున్న ఇమేజ్ ప్రకారం నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందేమోనని వెనకడుగు వేసేవాణ్ని. వ్యక్తిగతంగా బాలు అన్నయ్యతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. వాళ్లంతా నన్ను కుటుంబ సభ్యుడిగా భావించేవారు. అన్నయ్య ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ఎస్పీ వసంతతో, శుభలేక సుధాకర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడి ఆయన పరిస్థితి తెలుసుకున్నా. కానీ మనందరి దురదృష్టం ఆయన మనందరికీ దూరంగా వెళ్లిపోయారు. అన్నయ్య కోసం వసంత స్వయంగా రాసి పాడిన పాట ఎంతో బాగుంది. ఆ పాటను ఆమె అనుమతితో ఈ రోజు విడుదల చేస్తున్నాం. ఈ రోజు హనుమాన్ చాలీసా పాట వింటున్నప్పుడు ఆయన పాడిందేనని గుర్తొచ్చింది. ఆ రకంగా సంగీతం ఉన్నంత వరకు ఆయన చిరంజీవులై మనందరి మనస్సుల్లో ఉంటారు. ఆయన ఎక్కడున్నా శాంతంగా ఉండాలి. ఆయన అజరామరుడు.’’ అని అన్నారు.