చలికాలం వచ్చిందంటే చాలు చాలా మందికి ఆస్తమా సమస్య బాధిస్తుంటుంది. ముఖ్యంగా చిన్నారులు ఈ సమస్య కారణంగా ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. రాత్రి పూట సమస్య మరింత ఎక్కువవుతుంది. అయితే ఆస్తమా సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే చిన్నారులకు తల్లిదండ్రులు వారికిచ్చే ఆహారంలో ఈ పదార్థాలను చేర్చాలి. దీంతో సమస్య నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.
పాలకూర
ఇందులో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఆస్తమా లక్షణాలను చాలా వరకు తగ్గిస్తుంది. చిన్నారులకు ఆహారంలో పాలకూరను తినిపించడం వల్ల ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే చేపలు, గుమ్మడికాయ విత్తనాలు వంటి మెగ్నిషియం ఉండే ఆహారాలను తినిపిస్తే మంచిది.
అల్లం
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలకే కాకుండా ఆస్తమాకూ చక్కగా పనిచేస్తుంది. అల్లం రసాన్ని కొద్దిగా తేనెతో కలిపి తాగించవచ్చు. లేదా అల్లంను ఆహారంలో కలిపి ఇవ్వవచ్చు. లేదా అల్లం ముక్కలను వేసి నీటిలో మరిగించి డికాషన్ మాదిరిగా తయారు చేసి ఇవ్వవచ్చు. ఎలా తాగినా ప్రయోజనమే ఉంటుంది.
కోడిగుడ్లు
కోడిగుడ్లలో విటమిన్ డి ఉంటుంది. ఇది ఆస్తమాను, దాని సంబంధ లక్షణాలను తగ్గిస్తుంది. చిన్నారులకు విటమిన్ డి ఉండే కోడిగుడ్లతోపాటు పాలు, చేపలు తదితర ఆహారాలను ఇస్తే మంచిది.
పసుపు
పురాతన కాలం నుంచి పసుపును శ్వాసకోశ సమస్యలకు పరిష్కారంగా ఉపయోగిస్తున్నారు. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆస్తమాను తగ్గిస్తాయి. పసుపులో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు శ్వాస సమస్యలను తగ్గిస్తాయి. రాత్రి పూట గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు వేసి కలిపి చిన్నారులకు ఇస్తే మంచిది. ఆస్తమా తగ్గుతుంది.
బెర్రీస్
చెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలు వంటి బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు ఉంటాయి. ఇవి ఆస్తమాను తగ్గిస్తాయి.