ఆగస్టు 5వ తేదీన నాగుల పంచమి వస్తోంది. అయితే ఆ రోజున పుట్టల వద్దకు చేరుకుని పాములకు పాలు పోయకూడదని, పాములను ఆడించకూడదని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
నాగుల పంచమి వచ్చిందంటే చాలు.. మహిళలు నాగదేవతకు పూజలు చేస్తుంటారు. ఆ రోజున పుట్ట వద్దకు మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని పాములకు పాలు పోసి గుడ్లు పెట్టి పూజలు చేస్తూ మొక్కులు మొక్కుకుంటారు. అసలు హిందూ సంప్రదాయంలో పామును దైవంగా భావించి ఎప్పటి నుంచో పూజలు చేస్తున్నారు. కానీ ఈ సారి మాత్రం నాగుల పంచమి రోజున పాములకు పాలు పోయడం చేయకూడదని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
ఆగస్టు 5వ తేదీన నాగుల పంచమి వస్తోంది. అయితే ఆ రోజున పుట్టల వద్దకు చేరుకుని పాములకు పాలు పోయకూడదని, పాములను ఆడించకూడదని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా అలా చేస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని వారు తెలిపారు. ఈ మేరకు వారు హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో తాజాగా నిర్వహించిన ఓ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
పాములకు పాలు తాగించడం, వాటిని ఆడిస్తూ వినోదం చూడడం.. వంటివి జంతు హింస కిందకు వస్తాయని అటవీ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. పాములు పాలు తాగవని, ఎవరైనా వాటికి బలవంతంగా పాలు తాగించాలని చూసినా, పాములను ఆడించేందుకు వాటిని తీసుకుని వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు తెలిపారు. ఈ క్రమంలోనే పాముల సంరక్షణపై దేవాలయాలు, పాఠశాలలు, గ్రామ సభల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని వారు తెలిపారు.