నేడు జల సౌధలో బోర్డు చైర్మన్ ఎంకే సింగ్ నేతృత్వం లోని గోదావరి నది యాజమాన్య బోర్డు 14వ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఇరిగేషన్ శాఖ స్పెషల్ సిఎస్ రజత్ కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి, ఇతర నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గోదావరి నీటి లభ్యత, రాష్ట్రాల వాటా తేల్చాలని అడిగామని వెల్లడించారు. నీటి లభ్యతపై కేంద్ర సంఘాలతో శాస్త్రీయ అధ్యయనం చేయించాలని బోర్డు నిర్ణయించినట్లు తెలిపారు.
తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలు ఉన్న పట్టించుకోవడంలేదని అన్నారు నారాయణరెడ్డి. గూడెం ఎత్తిపోతలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని తెలిపామన్నారు. ఇక తెలంగాణ సిఎస్ రజత్ కుమార్ మాట్లాడుతూ.. మేడికుంట వాగు, గూడెం ఎత్తిపోతల డిపిఆర్ ల పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కొన్ని అభ్యంతరాలు లేవనెత్తినట్లు చెప్పారు. పోలవరం అంశాన్ని పిపిఏ లో చర్చించాలని.. గోదావరి మిగులు జలాల కోసం అధ్యయనం చేసి ఆ నివేదికలను సిడబ్ల్యుసి కి వెల్లడిస్తామని కేంద్ర జల సంఘం డైరెక్టర్ చెప్పినట్లు రజత్ కుమార్ వెల్లడించారు.