బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. వెనుకకు నెట్టేయబడ్డ వర్గాలకు సీఎం కేసీఆర్ విద్యను అందించి వారి సామాజిక, ఆర్థిక జీవన స్థితిగతులను మెరుగుపర్చడానికి విశేష కృషి చేస్తూ వెనుకబడిన వర్గాల విద్యాప్రధాతగా మారాడని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం ఆదేశాల మేరకు గురువారం బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు కాస్మెటిక్, బెడ్డింగ్ మెటీరియల్, వులన్ బ్లాంకెట్స్, నోట్ బుక్స్ అందజేసే ఉత్తర్వులను జారీ చేసామని ఓ ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోని 302 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్‌లో చదువుకునే కాలేజీ విద్యార్థులకు నాణ్యమైన భోజన, వసతులతో అదనంగా ప్రీమెట్రిక్ హాస్టల్స్, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ విద్యార్థుల మాదిరి సౌకర్యాలు అందుతాయన్నారు. ఏటా 12 కోట్లను అదనంగా కేటాయించడం ద్వారా దాదాపు 34వేల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారని స్పష్టం చేశారు.
కేవలం 19 ఉన్నబీసీ గురుకులాలను తెలంగాణలో ఇప్పటికే 327కు పెంచడమే కాకుండా, మహాత్మా జ్యోతీబాపూలే పేరున ఒక్కో విద్యార్థికి 20లక్షల విదేశీ విద్యానిది, రాష్ట్రంలోని విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ అందజేస్తున్నామన్నారు. ఈ ఏడు నుంచి దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి విద్యాసంస్థల్లో చదివే వెనుకబడిన వర్గాల బిడ్డలకు సైతం ఫీజులను చెల్లించబోతున్నామని ఆయన పేర్కొన్నారు. చరిత్రలో మొదటి సారిగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బీసీ విద్యార్థుల చదువుకు ఊతమిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రశంసించారు.