తిరుమల శ్రీవారి భక్తులకి టీటీడీ గుడ్ న్యూస్..

తిరుమల శ్రీవారి భక్తులకి టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే తిరుమల శ్రీవారిని దర్శించేందుకు వచ్చే భక్తుల కోసం సర్వదర్శనం టోకెన్ల కోటాను టీటీడీ పెంచింది. గతంలో 3వేలు టోకెన్లను జారీ చేస్తుండగా నేటి నుంచి 7 వేల టోకెన్లు జారీ చెయ్యనుంది టీటీడీ. నిజానికి ఈ సర్వదర్శనం టోకెన్లను మొన్న మంగళవారం నుంచి తాత్కాలికంగా నిలిపివేయడానికి టీటీడీ భావించింది. కోవిడ్ పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసే ఆలోచనలో టీటీడీ ఉందని ప్రచారం జరిగింది.

శ్రీవారి దర్శనానికి అనూహ్యంగా పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో సర్వదర్శనం టోకెన్ల కోసం భారీగా భక్తులు పోటెత్తుతున్న నేపధ్యంలో ఇదే నిర్ణయం తీసుకోవచ్చని భావించారు. ఇప్పటికే నాలుగు సార్లు సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసిన టీటీడీ మళ్ళీ ఇస్తోంది. అయితే ఈ రద్దు నిర్ణయం వెనక్కు తీసుకుని ప్రస్తుతానికి సర్వదర్శనం టోకెన్లు జారీని ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు సర్వ దర్శనం టోకెన్ జారీ కేంద్రాలను పెంచాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టోకెన్లను జారీ చేస్తున్న భూదేవి కాంప్లెక్స్ తో పాటు విష్ణునివాసం, మహతి ఆడిటోరియం, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద సర్వదర్శనం టికెట్ల జారీ కేంద్రాలు తెరవాలని మొన్న నిర్ణయం తీసుకుంది. ట్రయల్ రన్ క్రింద 10వ తేదీ వరకు పరిశీలించి ఆ తరువాత టోకెన్ల జారీని కొనసాగించాలా…లేక రద్దు చెయ్యాలో టీటీడీ ఒక నిర్ణయానికి రానుంది.