ముంబై చిత్రపరిశ్రమను ఉత్తరప్రదేశ్‌కు తరలించే సత్తా ఉంటే తీసుకెళ్లవచ్చని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు. మహారాష్ట్రలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో వినోదరంగాన్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం వ్యాఖ్యానించారు. నిర్మాతలను చిత్ర పరిశ్రమకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై ప్రతిపాదన సిద్ధం చేయాలని సూచించారు. మరాఠీ చిత్రాల కోసం థియేటర్లను ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఉద్ధవ్ చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌కు చిత్ర పరిశ్రమ తరలించడానికి చర్చలు జరుగుతున్నాయని, వారికి అంత సామర్థ్యం ఉంటే తీసుకెళ్లవచ్చని ఈ సందర్భంగా సీఎం సవాల్ విసిరారు. ఇక తన తండ్రి బాల్‌ఠాక్రేకు సినీరంగానికి అవినాభావ సంబంధం ఉందని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. తన తండ్రికి రాజ్‌కపూర్, దిలీప్‌కుమార్, దేవ్ ఆనంద్ తదితర నటులతో మంచి సంబంధాలు ఉన్నాయని ఉద్ధవ్ గుర్తుచేసుకున్నారు. ప్రొడక్షన్ హౌస్, స్టూడియోల నిర్మాణాలకు మద్దతు తెలిపారని గుర్తుచేశారు. చిత్ర పరిశ్రమ కేవలం వినోద రంగం మాత్రమే కాదు, మంచి సమాజాన్ని సృష్టించే సాధనం కూడా అని సీఎం అన్నారు. పరిశ్రమ పురోగతి, వృద్ధి కోసం మహా ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తుందని ఉద్ధవ్ హామీ ఇచ్చారు.