TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజీ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్వశ్చన్ పేపర్ లీకేజీకి పాల్పడిన ప్రధాన నిందితుడు ప్రవీణ్ స్త్రీలోలుడని.. మహిళలకు వల వేసి తాను అడిగింది చేస్తే క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తానని చెప్పేవాడని పోలీసులు తెలిపారు. అతడి మొబైల్లో ఏడుగురి మహిళల న్యూడ్ వీడియోలు లభించాయని చెప్పారు. మరోవైపు ప్రవీణ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా రాశాడని.. ఆ పేపర్ కూడా లీకైందనే విషయంపై ఆరా తీయగా అలాంటిదేం జరగలేదని తేలిందని వెల్లడించారు.
టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, లీకేజీకి సంబంధించి వెల్లడైన నిజాలపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని కమిషన్ కార్యదర్శికి ఆమె లేఖ రాశారు. లక్షల మంది జీవితాలకు సంబంధించిన అంశం అయినందున ఇలాంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కారాదని స్పష్టం చేశారు. టీఎస్‌పీఎస్సీపై ఉద్యోగార్థులకు నమ్మకం కలిగించేలా ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో తెలియజేయాలని గవర్నర్ తన లేఖలో కోరారు.