కోడికత్తి కేసులో బాధితుడైన ఏపీ సీఎం, అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి ఎన్‌ఐఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సాక్షిగా వచ్చే నెల 10న విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆంజనేయమూర్తి ఆదేశాలనిచ్చారు. దాడి జరిగిన సమయంలో విశాఖ విమానాశ్రయంలో కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న దినేష్‌కుమార్ కోర్టులో సాక్ష్యం చెప్పారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి.
దాడికి ఉపయోగించిన కత్తిని సంఘటన స్థలంలోనే స్వాధీనం చేసుకున్నారా? అని క్రాస్ ఎగ్జామినేషన్‌లో భాగంగా నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీమ్ కమాండెంట్‌ను ప్రశ్నించారు. ఆ స్థలం నుంచి స్వాధీనం చేసుకోలేదని, కాసేపటికి వైస్సార్సీపీ కార్యకర్త చిన్న శ్రీను కత్తిని తెచ్చి ఇచ్చారని న్యాయమూర్తి ఎదుట వెల్లడించారు. దాడిని ప్రత్యక్షంగా చూడలేదని న్యాయవాది సలీమ్ అడిగిన మరో ప్రశ్నకు కమాండెంట్ బదులిచ్చారు.
2018లో విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై దాడి ఘటనలో నిందితుడైన శ్రీనివాసరావు నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను ఎన్‌ఐఏ అధికారులు కోర్టులో సమర్పించారు. ఈ విషయంలో జాప్యంపై గత వారం విచారణ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో మిగిలిన వస్తువులైన రెండు కత్తులు, పర్సు, సెల్‌ఫోన్, బెల్టు, ఏటీఎం కార్డు, రూ.10 నోటును కోర్టుకు అప్పగించారు.