కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈడీ వేధింపులకు నిరసనగా చలో రాజ్ భవన్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ చేరుకునే విషయంలో ఆందోళన నెలకొంది. అయితే తమిళిసై ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజ్ భవన్ చేరుకున్నారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు రాజ్ భవన్ పరిసరాల్ని ముట్టడిస్తున్నాయి. దశలవారీగా ముట్టడి కార్యక్రమం కొనసాగుతోంది.
దీంతో ఖైరతాబాద్, నాంపల్లి చుట్టుపక్కల ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. అధికారులు రాజ్ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులు చొచ్చుకురాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇంకా ఆ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.ఖైరతాబాద్ వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లిస్తున్నారు. కాంగ్రెస్ నిరసన ఉద్రిక్తంగా మారింది. కార్యకర్తలు వాహనాలను ధ్వంసం చేశారు. సిటీ బస్సు పైకెక్కి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.