తెలంగాణ పచ్చదనంతో పరిఢవిల్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంలో ఎంపీ సంతోశ్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, అధికారులు, సిబ్బంది, ప్రజలు అందరితో మొక్కలు నాటించారు. ఒకరు మొక్కలు నాటి మరో ఇద్దరు ముగ్గురికి మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసరడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. మొక్కలు నాటడమే కాదు వాటి పరిరక్షణ బాధ్యత కూడా నాటిన వారిదే.
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మొదలై.. అంతకుమించి విజయమార్గంలో దూసుకెళ్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కించుకుంది. సామాజిక సేవా విభాగంలో “ఒక గంటలో అత్యధిక మొక్కలు నాటించే” బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఈ కార్యక్రమ సృష్టికర్త, ఎంపీ సంతోశ్ కుమార్‌కు చోటు కల్పించినట్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ వత్సల కౌల్బెనర్జీ తెలిపారు.
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంసా పత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఎంపీ సంతోశ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగమై.. ఈ రికార్డు సాధించడానికి కారణమైన మాజీ మంత్రి జోగు రామన్నకు సంతోశ్ కృతజ్ఞతలు తెలిపారు. జోగు రామన్న తన పుట్టిన రోజు సందర్భంగా 2021లో జులై4న 16,900 మంది సాయంతో 3,54,900 మొక్కలు నాటించారని తెలిపారు. మరోవైపు సమష్టి కృషి, సామాజిక స్పృహకు ఈ కార్యక్రమం నిలువెత్తు నిదర్శనమని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంసించింది.