నిత్యం మనలో అధిక శాతం మంది రక రకాల టీలను తాగుతుంటారు. చాలా మంది తాగే టీలలో గ్రీన్ టీ కూడా ఒకటి. ఇక కొందరు బ్లాక్ టీ కూడా తాగుతారు. అయితే రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంటుంది. రెండూ ఆరోగ్యానికి మంచివే.. అయితే ఈ రెండు టీలలో మనకు ఎక్కువ ఆరోగ్యాన్ని అందించే టీ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రీన్ టీలో పాలీఫినాల్స్ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి బ్లాక్ టీలో కన్నా గ్రీన్ టీలోనే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల గ్రీన్ టీని నిత్యం సేవిస్తే మన శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. అదే బ్లాక్ టీ ఈ విషయంలో అంత ఎఫెక్టివ్‌గా పనిచేయదు. కనుక బరువు తగ్గాలనుకునే గోల్ ఉన్న వారు బ్లాక్ టీకి బదులుగా గ్రీన్ టీ తాగితే మంచిది. అది అవసరం లేదనుకునే వారు రెండింటిలో ఏ టీ అయినా తాగవచ్చు.
ఇక గ్రీన్ టీ, బ్లాక్ టీ.. రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కనుక ఇవి రెండూ గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. లివర్ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అలాగే క్యాన్సర్ రాకుండా చూస్తాయి. ఈ లాభాలు కలగాలంటే నిత్యం రెండు టీలను తాగవచ్చు.
కొందరు నైట్ డ్యూటీ చేసేవారుంటారు. అలాగే విద్యార్థులు రాత్రి పూట చదువుకుంటుంటారు. ఇక కొందరు రాత్రి పూట ఏదైనా పని ఉంటే చేసుకుంటారు. అలాంటి వారు రాత్రి పూట మేల్కొని ఉండేందుకు బ్లాక్ టీని తాగాలి. దీంట్లో గ్రీన్ టీ కన్నా కెఫీన్ అధికంగా ఉంటుంది. ఇది అంత త్వరగా నిద్ర రానీయదు. దీంతో ఎక్కువ సేపు మెలకువగా ఉండవచ్చు. అయితే రాత్రి పూట బ్లాక్ టీని ఒక కప్పు కన్నా మించి సేవించరాదు. ఎక్కువ సేవిస్తే అందులో ఉండే కెఫీన్ అనారోగ్య సమస్యలను కలగజేస్తుంది.
కాబట్టి తెలుసుకున్నారుగా.. ఏ టీని తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో.. కనుక ఇకపై టీని ఎందుకు తాగుతున్నారో.. ఏ లాభం కోసం తాగుతున్నారో.. తెలుసుకుని మరీ తాగండి. అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.