తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగకు ముందే రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడించేలా టీఎస్‌పీఎస్సీ సమాయత్తమవుతోంది. ఇప్పటికే కసరత్తు పూర్తిచేసింది. ఇవాళ లేదా రేపు ఫలితాలు వెల్లడించాలని భావిస్తోంది. సంక్రాంతికి ముందుగానే గ్రూప్-1 పరీక్ష రాసిన వారికి తీపి కబురు అందించాలని నిర్ణయించింది.
గ్రూప్-1 ఉద్యోగాలకు తనను స్థానికురాలిగా పరిగణించాలని ఆరో తరగతి మినహా ఒకటి నుంచి పీజీ వరకు తెలంగాణలో చదివిన పి.నిహారిక అనే అభ్యర్థి జులైలో హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏడో తరగతికి ముందు వరసగా నాలుగేళ్లు ఇక్కడ చదివిన వారికే తెలంగాణ స్థానికత వర్తిస్తుందని ప్రభుత్వం వాదించింది. వాదనలు విన్న ధర్మాసనం ఫలితాలను వెల్లడించడానికి టీఎస్‌పీస్సీకి అనుమతిస్తూ అభ్యర్థికి సంబంధించిన వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని దాన్ని పరిశీలించాక తగిన ఆదేశాలిస్తామని తెలిపింది. అభ్యర్థి స్థానికత్వ వివాదాన్ని తరువాత పరిశీలిస్తామని.. ముందు ఫలితాలను విడుదల చేయవచ్చంటూ టీఎస్‌పీఎస్సీకి అనుమతిస్తూ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.