ఐపీఎల్ 2022 లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య పోరు జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ నిర్ధేశించిన భారీ స్కోర్ ను గుజరాత్ టైటాన్స్ సునాయాసంగా ఛేదించి ఘన విజయాన్ని నమోదు చేసింది. 190 పరుగల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓపెనర్ మాథ్యూ వేడ్ (5) విఫలం అయినా… శుభమాన్ గిల్ (56 బంతుల్లోనే 96) దుమ్ములేపాడు. 11 ఫోర్లు 1 సిక్స్ తో పరుగుల వరదా పారించాడు. తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ (35), హర్ధిక పాండ్యా (27) రాణించారు.
చివర్లో 2 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో రాహుల్ తెవాటియా (13) వరసగా రెండు సిక్స్ లు బాది గుజరాత్ కు విజయాన్ని అందించాడు. దీంతో గుజరాత్ ఆడిన మూడు మ్యాచ్ లలో విజయం సాధించి 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. కాగ 96 పరుగులతో రాణించిన శుభమాన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
దీనికి ముందు పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. పంజాబ్ బ్యాట్స్ మెన్లు శిఖర్ ధావన్ (35), లివింగ్ స్టోన్ (64), రాహుల్ చాహర్ (22) చేయడంతో 189 భారీ స్కోర్ చేసింది. ఈ భారీ స్కోరు ను గుజరాత్ సునాయాసంగా ఛేదించింది.