ఒకే ఒక్క గోల్డెన్ గోల్.. భారత్ జట్టును సెమీస్‌కు చేర్చిన గుర్జిత్ కౌర్ మీకు తెలుసా?

-

టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్స్‌‌కు చేరుకున్నది. క్వార్టర్ ఫైనల్స్‌లో నమోదైన ఏకైక గోల్‌ను కొట్టిన గుర్జిత్ కౌర్‌ Gurjit Kaur కే విజయంలో కీలక పాత్ర పోషించారు.

భారత మహిళల హాకీ జట్టు చిట్టచివరగా 1980, మాస్కో ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. మొత్తం ఆరుజట్లు పాల్గొనగా టీమ్‌ఇండియా నాలుగో స్థానంతో మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ ఒలింపిక్స్‌ ద్వారానే మొదటిసారిగా మహిళల హాకీ క్రీడలకు ప్రవేశం కల్పించారు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్స్‌లో తలపడ్డాయి.

క్వార్టర్ ఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌ ఆస్ట్రేలియాను 1-0 తేడాతో ఓడించిన భారత జట్టు సగర్వంగా సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది.

గుర్జిత్‌కౌర్ భారత జట్టులో డిపెండర్ ప్లేయర్. భారత మహిళల హాకీ డ్రాగ్ ఫ్లిక్కర్‌గా ఆమెకు పేరు ఉన్నది. పంజాబ్ రాష్ట్ర అమృత్‌సర్ జిల్లాలోని మియాది కలాన్‌లోని సాధారణ రైతు కుటుంబంలో గుర్జిత్ కౌర్ జన్మించింది. ఆమె అక్క ప్రదీప్ కౌర్.

కుటుంబ పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ గుర్జిత్ కౌర్ తల్లిదండ్రులు సత్నామ్ సింగ్, హర్జీందర్ కౌర్‌లు తమ కుమార్తెలకు మంచి విద్యను అందించాలని భావించి స్వగ్రామం నుంచి 13కి.మీ. దూరంలోని అజ్ఞాలలోని ప్రైవేట్ స్కూల్‌‌‌‌కు పంపారు. ప్రతిరోజు ఉదయం ఇద్దరు కూతుర్లను సత్నామ్ సింగ్ సైకిల్‌పై స్కూల్‌కు తీసుకెళ్లేవాడు. స్కూల్ పూర్తయ్యేవరకు బయట వేచి ఉండి మళ్లీ తీసుకువచ్చేవారు. ఎట్టకేలకు 2006లో దేశంలో మహిళల హాకీకి ప్రఖ్యాతిగాంచిన కైరాన్ బోర్డింగ్ స్కూల్‌కు గుర్జిత్ కౌర్, ప్రదీప్ కౌర్‌ను పంపించాలని తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడే ఆ అక్కాచెల్లెళ్లలోని హాకీ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. అది వారికి ప్రభుత్వ క్రీడా పాఠశాలలో చోటుదక్కేలా చేసింది. అక్కడే వారికి చదువు, ఆహారం ఉచితంగా లభించాయి.

ఆ తర్వాత జలంధర్‌లోని లియాపూర్ ఖల్సా మహిళల కళాశాలలో గుర్జిత్ కౌర్ ఉన్నత విద్యను పూర్తిచేయడంతోపాటు డ్రాగ్ ఫ్లిక్కింగ్‌లో ఆసక్తిని పెంచుకోవడంతోపాటు శిక్షణ కూడా పొందింది. స్పోర్ట్స్ కోటా కింద రైల్వేలో జూనియర్ క్లర్క్ జాబ్ వచ్చింది.

2014లో సీనియర్ నేషనల్ క్యాంప్‌నకు ఎంపిక కావడంతో దేశానికి మొట్ట మొదటిసారి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకున్నది. ఎట్టకేలకు, 2017లో భారత మహిళల హాకీ జట్టులో తన చోటును సుస్థిరం చేసుకున్నది.

2017లో ఆసియా కప్ ద్వారా గుర్జిత్ కౌర్ వెలుగులోకి వచ్చింది. 2018లో లండన్‌లో జరిగిన హాకీ వరల్డ్ కప్‌లో ప్రతిభ‌ను చాటింది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది గోల్స్ కొట్టిన గుర్జిత్ కౌర్ అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్లలో మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్పెయిన్ టూర్, 2018 కామన్‌వెల్త్ క్రీడల్లో గుర్జిత్ కౌర్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది.

టోక్యో ఒలింపిక్స్‌లో గుర్జిత్ కౌర్ కొట్టిన ఏకైక గోల్ భారత జట్టును సెమీఫైనల్స్‌కు చేర్చింది.

Read more RELATED
Recommended to you

Latest news