ప్రముఖ గుస్సాడీ నృత్య కళాకారుడు,పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు(70) అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన భౌతిక కాయానికి శనివారం మర్లవాయిలో ఆదివాసీల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కనకరాజు మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయటంతో పాటు తెలంగాణ కళలను, సంస్కృతి – సంప్రదాయాలను కాపాడిన అసామాన్యుడు కనకరాజు అని కొనియాడారు.
ఆయన మరణం తెలంగాణ కళలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. గుస్సాడీ నృత్య ప్రదర్శనలతో పాటు ఇతరులకు నేర్పించటంలోనూ కనకరాజు తన విశేష సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. దీంతో కనకరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్రమంలోనే అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరపాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఆదివాసీల గుస్సాడీ నృత్యానికి విశిష్ట సేవలు అందించినందుకు గాను 2021లో కనగరాజును భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సత్కరించిన విషయం తెలిసిందే.