ఆస్పత్రిలో కూడా వైద్యునిపై కుల వివక్ష చూపిస్తోన్న ఘటన హరియాణాలో చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ఆయనకు కూర్చునేందుకు కూడా స్థలం ఇవ్వడం లేదని, రోగులను చూడాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ డాక్టర్ వాపోయారు. కులవివక్షతోనే ఇదంతా జరుగుతోందని వెక్కివెక్కి ఏడ్చారు. ఆయన తన బాధలు పక్కనున్న వారితో చెప్పుకుంటూ ఏడ్చారు. ఈ సంఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఉన్న డాక్టర్ పేరు ధర్మేంద్ర అని సమాచారం. వీడియోలో వైద్యుడి వాయిస్ వినిపించడం లేదు. అయితే దాన్ని చిత్రీకరించిన వ్యక్తి వైద్యుడి కష్టాలను వివరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. భివానీ జనరల్ ఆస్పత్రిలో ధర్మేంద్ర పనిచేస్తున్నారు. డాక్టర్ స్వస్థలం బిహార్. ఆ వైద్యుడు నిజాయతీపరుడే. కానీ ఆస్పత్రిలో కూర్చునేందుకు ఆయనకు కుర్చీ ఇ్వవడం లేదు. వైద్యుడి కులాన్ని చూసి వారు ఇలా చేస్తున్నారు. అందువల్ల డాక్టర్ తన రోగులకు వైద్యం చేయలేకపోతున్నారు. మనోవేదన ఎక్కువై ఒక్కసారిగా ఏడ్చేశారు’ అని వీడియో తీసిన వ్యక్తి చెప్పారు.
ఈ ఘటనపై ఆస్పత్రి అధికారులకు వైద్యుడు ధర్మేంద్ర ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే, కులవివక్ష కారణంగానే వైద్యుడిని ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారా అనేది స్పష్టంగా తెలియలేదు.