మాజీ సీఎం జగన్ వల్లే తాను ఓడిపోయినట్లు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రక్షణ నిధి సంచలన వ్యాఖ్యలు చేశారు.తిరువూరు నియోజకవర్గంలో కూటమి గెలుపునకు మద్దతుగా తాను ప్రచారం చేసినట్లు తెలిపారు. కాలమే తన రాజకీయ భవిష్యత్తు నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. ప్రతిపక్ష నేతగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు ఉన్నానని.. జగన్ వల్లే తాను ఓడిపోయానన్నారు.
సీఎం హోదాలో తిరువూరు వచ్చి జగన్ ఇచ్చిన హామీలు నీటి మూటలు అయ్యాయని రక్షణ నిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. బటన్ నొక్కుడు తప్ప సీఎంగా రాష్ట్రానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ వల్లే తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయానని అన్నారు. 2023 డిసెంబర్ నుంచి వైసీపీ పార్టీకి దూరంగా ఉన్నట్లు తెలిపారు. ఐ ప్యాక్ టీం, అసమర్ధ సలహాదారులను నమ్మి ఆయన నట్టేట మునిగారని అన్నారు.జగన్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, కనీసం ఎప్పుడైనా ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలుగా గుర్తించావా? అంటూ ఆయన ప్రశ్నించారు.