రాష్ట్రంలో మరో మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ద్రోణి ప్రభావంతో భారీ వానలు పడతాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇప్పటికే గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా భాగ్యనగరంలో వరణుడు దంచికొడుతున్నాడు. ఏకధాటి వానకు నగరంలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులపైకి నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
మరోవైపు.. పలు జిల్లాల్లో చెరువులు అలుగు పారుతూ రహదారులపైకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వంతెనలపై నుంచి నీరు పారుతున్నాయి. పలు గ్రామాల్లో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అలుగు పారుతున్న చెరువు అందాలను చూడటానికి ఆ గ్రామాల ప్రజలు బారులు తీరుతున్నారు.