ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రవైపు దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతం మీదుగా మాండుస్ తీవ్ర తుపాను దాదాపు 12 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా వెళ్లి నైరుతి మీదుగా పయనిస్తోంది. ట్రింకోమలీ (శ్రీలంక)కి ఉత్తర-ఈశాన్యంగా 240 కి.మీ., జాఫ్నాకు 270 కి.మీ తూర్పు-ఈశాన్య (శ్రీలంక), కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 270 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంలో 350 కి.మీ. వద్ద కేంద్రీకృతమై ఉంది. దీంతో.. తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలపై మాండస్ తుఫాన్ ప్రభావంతో.. భారీ వర్షాలు జిల్లాలను ముంచెత్తనున్నాయి. తుఫాను ప్రభావంపై తిరుపతి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.
అధికార యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డి మత్సకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు. ముంపు ప్రాంత బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తిరుపతి నగరపాలక కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ 0877 2256766 ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం పాఠశాలలు, కళా శాలలకు సెలవు ప్రకటించారు చిత్తూరు జిల్లా కలెక్టర్. మాండూస్ తుఫాను నేపథ్యంలో నేటి మధ్యాహ్నం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ప్రకటన చేశారు.