నడిగర్ సంఘం అగ్ని ప్రమాదం వెనుక విశాల్ హస్తం ఉందా ?

-

నడిగర్ సంఘం భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో సంఘానికి సంబంధించి కీలక నిధులు, ఆస్తుల పత్రాలన్నీ కాలిపోయాయనే వార్త తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. నడిగర్ సంఘం వ్యవహారాలకు సంబంధించి మూడేళ్లుగా అనేక వివాదాలు ఉన్నాయి. దీంతో తాజా ప్రమాదం నిజంగా జరిగిందా లేక దీని వెనుక ఎవరైనా పెద్దల హస్తం ఉందా అనే చర్చ ఇప్పుడు కోలివుడ్ లో నడుస్తుంది.

తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించి అనేక సంఘాలు ఉన్నా.. నడిగర్ సంఘానికున్న ప్రత్యేకత వేరు. ఈ సంఘం కార్యవర్గ ఎన్నికలు.. ఒక రేంజ్‌లో జరుగుతాయి. నడిగర్ సంఘంలో ఎంత మేరకు నిధులున్నాయి. నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ కార్యదర్శిగా మారిన తర్వాత నిధులు ఎంత మేరకు ఖర్చు అయ్యాయి. సంఘం కార్యక్రమాల నిర్వహణకు సేకరించిన నిధులు ఎంత?. అందులో ఎంత ఖర్చైంది? లాంటి వివరాలకు సంబంధించిన లెక్కలన్నీ ఈ ఆఫీసులోనే ఉన్నాయి. దీంతో ఇప్పుడు జరిగిన అగ్ని ప్రమాదంపై అనుమానాలు చెలరేగుతున్నాయి. నిజంగానే ప్రమాదం జరిగిందా?. ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందా అని తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు.

దక్షిణ భారత నటీనటుల సంఘంగా పిలిచే నడిగర్ సంఘాన్ని 1952లో ఎంజీ రామచంద్రన్, ఎన్ఎస్ కృష్ణన్, కే సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమ కూడా దీని పరిధిలోనే ఉండేది. ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చాక ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఏర్పడింది. నడిగర్ సంఘానికి పరిమిత కాలానికి ఎన్నికలు జరుగుతుంటాయి. విశాల్ కంటే ముందు శరత్ కుమార్ ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. శరత్ కుమార్ హయాంలో నిధులు దుర్వినియోగం అయ్యాయని విశాల్, నాజర్‌తో పాటు మరి కొందరు ఆరోపణలు చేశారు. సంఘం ఎన్నికల్లో విశాల్ ప్యానల్ గెలవడానికి ఇది కూడా ఒక కారణం.

నడిగర్ సంఘానికి కొత్త భవంతి లేదని, అది కట్టిన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని విశాల్ ప్రతిజ్ఞ చేశాడు. నిధుల సేకరణకు సంఘం తరపున కార్యక్రమాలను నిర్వహించారు. అయితే ఏ కార్యక్రమానికి ఎంత నిధులు వచ్చాయనే లెక్కలు విశాల్ ఎవరికీ చెప్పలేదు. దీంతో నాజర్, విశాల్ పని తీరుపైనా విమర్శలు వచ్చాయి. దాదాపు పదికోట్ల రూపాయలు మేరకు నిధులు పక్క దారి పట్టాయని కొందరు ఆరోపించారు. నిర్మాతల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న విశాల్ పెద్ద నిర్మాతలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే అపవాదు ఉంది. సీనియర్ దర్శక నిర్మాత భారతీరాజా కొత్త నిర్మాతల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నడిగర్ సంఘం ఎన్నికలు, నిర్మాతల సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలపై కోర్టుకు వెళ్లడంతో ఫలితాల విడుదలను ఆపేసింది న్యాయస్థానం.

వివాదం కొనసాగుతున్న సమయంలోనే నడిగర్ సంఘం ఉన్న భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కార్యాలయానికి చెందిన ఫర్నీచర్, ఇతర సామాగ్రీతో పాటు కొన్ని విలువైన పత్రాలు దగ్ధమైనట్లు సమాచారం. సిబ్బంది ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ముఖ్యమైన స్టేషనరీ కాలిపోయిందంటున్నారు అగ్నిమాపక అధికారులు. కాలిపోయిన వాటిలో సంఘానికి సంబంధించిన లెక్కలన్నీ ఉన్నాయంటోంది విశాల్ వ్యతిరేక వర్గం.

ప్రమాదం వెనుక విశాల్, నాజర్ వర్గం ఉందని తమిళ సినీ ఇండస్ట్రీలోని ఓ వర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణల గురించి కానీ, ప్రమాదం గురించి కానీ.. ఇప్పటి వరకూ విశాల్ కానీ, నాజర్ కానీ స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news