2022 కల్లా నవ భారతదేశానికి సరికొత్త, అత్యంతాధునాతన సాంకేతికతతో, అద్భుతమైన లోక్‌సభాభవనం అందుబాటులోకి రానుందని సభాపతి ఓం బిర్లా తెలిపారు.
భారతదేశానికి ఒక కొత్త, అత్యంత ఆధునిక, సాంకేతిక సదుపాయాలతో పార్లమెంట్ భవనం కావాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభిప్రాయపడ్డారు. భారత్ తన 75వ స్వాతంత్రదినోత్సవం నాటికి కొత్త పార్లమెంట్ భవనం ఉంటే బాగుంటుదని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
కొత్త పార్లమెంట్ భవనం గురించి విస్తృతంగా చర్చిస్తున్నట్లు, దీనిలో సభ్యులతో పాటు, సిబ్బంది, ఇతర అధికారులు కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. ‘అందరు పార్లమెంట్ సభ్యులు ఈ విషయమై ప్రధానమంత్రిని కూడా కలిసి విజ్ఞప్తి చేసారు. ఒక అద్భుతమైన, సాంకేతికంగా ఉన్నతమైన పార్లమెంట్ భవనం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్‌కు ఉండాలని వారు ప్రధానికి విన్నవించారు. ప్రధాని కూడా దీనిపై సానుకూలంగా స్పందించారు’ అని ఓం బిర్లా మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేసారు.
ప్రస్తుత పార్లమెంట్ భవనాన్ని కూడా కొత్తగా మార్చాలని నిర్ణయించినట్లు తెలిపిన స్పీకర్, సభ్యులు వారివారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. దీనిపై చర్చ అవసరం అన్న ఆయన, 2022లో భారత్ 75వ స్వాతంత్య్రదినోత్సవాన్ని జరుపుకోబోతున్న తరుణాన, ఈ ప్రజాస్వామ్య దేవాలయానికి కొత్త భవనం దిశగా అడుగులు వేద్దామని సభాపతి తెలిపారు.
ప్రస్తుత భవనాన్ని, ఎడ్విన్ ల్యూటెన్ అనే బ్రిటిష్ ఆర్కిటెక్ట్ డిజైన్ చేసారని, నిర్మించడానికి ఆరేళ్లు పట్టిన ఈ బిల్డింగ్, 1927జనవరిలో ప్రారంభించబడిందని, పార్లమెంట్లు రికార్డులు తెలుపుతున్నాయి. దీనికి అప్పట్లో 83 లక్షలు ఖర్చయింది.
ఇంతకుముందు స్పీకర్ ఓం బిర్లా ఇదే విషయాన్ని గతంలో ఒక విలేకరుల సమావేశంలో కూడా తెలిపారు. ఒక అందమైన, అద్భుతమైన, అధునాతనమైన భవంతి భారత పార్లమెంటుకు ఎంతో అవసరమని తామంతా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అధికారపార్టీ సభ్యులు మాత్రమే కాకుండా, ప్రతిపక్ష సభ్యులు కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేసారని ఓం బిర్లా అన్నారు.