రూట్ల ప్రైవేటీక‌ర‌ణ‌పై స్టే పొడిగింపు: తెలంగాణ హైకోర్టు

తెలంగాణ ఆర్టీసి సమ్మె చేపట్టి నేటికి దాదాపుగా నెలన్నర పైగా అవుతుంది. అయితే రాష్ట్రంలో 5,100 రూట్ల ప్రైవేటీకరణకు కేబినెట్‌ తీర్మానం చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో బుధవారం విచారణ జ‌రిగింది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటికరణ జడ్జ్మెంట్ లను పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపించారు. అయితే తెలంగాణ‌లో రూట్ల ప్రైవేటీక‌ర‌ణ‌పై హైకోర్టులో విచార‌ణ శుక్ర‌వారానికి వాయిదా ప‌డింది.

తదుప‌రి చ‌ర్య‌లు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని, మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను పొడిగించ‌వ‌ద్ద‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కోరింది. ఎజి అభ్య‌ర్థ‌న‌ను తోసిపుచ్చిన ధ‌ర్మాస‌నం.. మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను శుక్ర‌వారం వ‌ర‌కు పొడిగించింది. అయితే నీరు గాలి సముద్రం అడవులు ఏ విధంగా సహజ వనరులో అలాగే రవాణా వ్యవస్థ కూడా సహజ వనరు. అటువంటి వాటిని ప్రైవేట్ వాళ్లకు అప్పగించకుడదని గతంలో సుప్రీం కోర్టు చెప్పిందన్న విష‌యాన్ని పిటిషనర్ గుర్తు చేశారు.

కాగా, స‌హజ వనరు అంటే నిర్వచనం చెప్పాలని హైకోర్టు ప్ర‌శ్నించింది. రోడ్డు సహజ సంపద కాద‌ని హైకోర్టు తెలియ‌జేసింది. అలాగే కేబినెట్ నిర్ణ‌యంపై జివో ఇచ్చే వ‌ర‌కు న్యాయ స‌మీక్ష చేయ‌రాద‌ని ప్ర‌భుత్వం త‌ర‌పున ఎజి వాద‌న‌లు వినిపించారు. స‌మ్మె నేప‌థ్యంలో రూట్ల ప్రైవేటీక‌ర‌ణ వెనుక దురుద్దేశాలు ఉన్నాయ‌ని పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది వాదించారు.