హైడ్రామా నడుమ కేరళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉయదం ప్రారంభమయ్యాయి. కేరళ అసెంబ్లీలో గవర్నర్ పై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు నిరసనకు దిగడం.. యాంటీ సీఏఏ పోస్టర్లు పట్టుకొని.. ‘గవర్నర్.. గో బ్యాక్’ నినాదాలు చేయడంతో సభ దద్దరిల్లిపోయింది. దాంతో హౌస్ మార్షల్స్ , గవర్నర్ ఎస్కార్ట్ పోడియం వరకు రావలసి వచ్చింది. నిరసనకు దిగిన ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు లాక్కెళ్లారు.
మార్షల్స్ తన కుర్చీ వద్దకు తీసుకెళ్లిన తర్వాతే గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్.. తనను ఉద్దేశించి నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలకు చేతులు జోడించి ‘కృతజ్ఞతలు’ తెలిపారు. అయితే గవర్నర్ తన ప్రసంగం ప్రారంభించిన వెంటనే పలువురు ఎమ్మెల్యేలు నిరసనగా వాకౌట్ చేశారు. అసెంబ్లీ గేటు వద్దకు చేరుకొని వారు ధర్నాకు దిగారు. మరోవైపు తన ప్రసంగంలో భాగంగా సీఏఏ వ్యతిరేక తీర్మానంలోని కొంతభాగాన్ని గవర్నర్ చదివి వినిపించారు. అయితే, ఇది తన అభిప్రాయం కాదని, కేవలం ప్రభుత్వ అభిప్రాయం మాత్రమేనని, ప్రభుత్వ అభిప్రాయంతో ఏకీభవించనప్పటికీ.. సీఎం కోరిక మేరకు, ఆయన దీనిని నేను చదవాలని కోరుతున్నందుకే చదివి వినిపించానని గవర్నర్ ఖాన్ వివరించారు.