ప్రస్తుత తరుణంలో ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని మనం ఊహించలేం. అది నిత్యం మనకు కావల్సిన నిత్యావసర వస్తువుగా మారింది. ఇంటర్నెట్ లేకుండా మనం ఒక్క క్షణం కూడా ఉండలేం. అందులో భాగంగానే ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న వారి సంఖ్య చాలా పెరిగింది. 2007లో దేశంలో కేవలం 4 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్‌ను ఉపయోగించేవారు. కానీ 2020 వరకు దేశంలో సగం జనాభా ఇంటర్నెట్‌ను వాడుతున్నారని వెల్లడైంది. ఇక అనేక నగరాల్లో అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ సరాసరి వేగాలు ఇలా ఉన్నాయి.
దేశంలో సగటున అత్యధిక ఇంటర్నెట్ స్పీడ్‌ను చెన్నైకి చెందిన వినియోగదారులు పొందుతున్నట్లు ఊక్లా కంపెనీ వెల్లడించింది. అక్కడ ఒక్కో పౌరుడికి వస్తున్న ఇంటర్నెట్ స్పీడ్ సగటున 51.07 ఎంబీపీఎస్‌గా ఉన్నట్లు పేర్కొంది. ఇక చెన్నై తరువాత రెండో స్థానంలో బెంగళూరు నిలిచింది. అక్కడి పౌరులకు సగటున 42.5 ఎంబీపీఎస్ చొప్పున ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తోంది. ఆ తరువాతి స్థానంలో హైదరాబాద్ నిలిచింది. సగటు హైదరాబాద్ పౌరుడికి 41.68 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ లభిస్తున్నట్లు వెల్లడైంది.
హైదరాబాద్ తరువాతి స్థానాల్లో లక్నో, కోల్‌కతాలు నిలిచాయి. లక్నోలో సగటు ఇంటర్నెట్ స్పీడ్ 34.6 ఉండగా, కోల్‌కతాలో సగటు ఇంటర్నెట్ స్పీడ్ 34.24గా ఉంది. తరువాత 11.46 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ముంబై ఆ జాబితాలో నిలిచింది. అంటే ముంబైలో సగటున ఒక పౌరుడికి అందుతున్న నెట్ స్పీడ్ 11.46 ఎంబీపీఎస్‌గా ఉందని అర్థం. అయితే ఇది కేవలం ఫిక్స్‌డ్ ఇంటర్నెట్ కనెక్షన్లు కలిగి ఉన్నవారికే వర్తిస్తుంది. ఇతర మార్గాల్లో ఇంటర్నెట్‌ను పొందుతున్న వారిలో అహ్మదాబాద్ నంబర్ 1 స్థానంలో ఉంది. అక్కడ అందుతున్న నెట్ స్పీడ్ స్కోరు శాతం 71.7 ఉండగా, తరువాత నవీ ముంబై నిలిచింది. అక్కడ నెట్ స్పీడ్ స్కోరు 70.1 గా ఉంది, తరువాత ముంబై (67.8), లక్నో (53.3)లు నిలిచాయి.