వివాదాస్పద కొఠియా గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేరెళ్ల వలస, సారిక దగ్గర ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లను ఒడిశా పోలీసులు అడ్డుకుంటున్నట్లు చెబుతున్నారు. ఓటర్లను ఆపేందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు, పలువురు నేతలు యత్నిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే ఓటర్లు మాత్రం ఓటు హక్కు వినియోగించుకు తీరతామని చెబుతున్నారు. తోణం, మొనంగి పోలింగ్ బూత్ లకు ఓటర్లు రాకుండా రోడ్డుకు అడ్డంగా బండరాళ్ళు కూడా ఒడిశా ప్రజాప్రతినిధులు పెట్టినట్లు తెలుస్తోంది.
విజయనగరం నుంచి 60 కిలో మీటర్ల కొండ ప్రాంతాల్లో విజయనగరం–కోరాపూట్ జిల్లాల మధ్య ఉండే 21 ప్రాంతాలను కొఠియా గ్రామాలు అంటారు. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు అవతరించినప్పుడు కొఠియా గ్రామాల్లో సర్వే జరగకపోవడంతో వాటిని ఏ ప్రాంతాల్లో కలపలేదు. ఆ తర్వాత సర్వే కాని గ్రామాలన్నీ తమవంటే తమవని రెండు రాష్ట్రాలు వాదించుకుని 1968 లో కోర్టు మెట్లు ఎక్కాయి. వాదోపావాదనలు తర్వాత 2006లో పార్లమెంట్‌లో తేల్చుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించినా ఇప్పటికి కూడా ఆ సమస్య తీరలేదు.