శంకరులు సన్యాస దీక్షకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా ?

-

సన్యాసం తీసుకోవాలంటే తప్పనిసరిగా తల్లిదండ్రలు అనుమతి ఉండాలి. అయితే శంకరులకు తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి ఆయన బాధ్యతలు చూస్తుంది. దీంతో ఆయన తల్లిని సన్యాసం కోసం అనుమతి అడిగితే ఒప్పుకోదు. ఎందుకంటే లేకలేక పుట్టిన బిడ్డ. అందులో ఒకే ఒక్కడు. తండ్రి లేడు. కాబట్టి శంకరుల మీద ప్రేమను వదులుకోలేక తల్లి ఒప్పుకోదు. అలాంటి సందర్భంలో ఒకరోజు…. శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలో అయినా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరారు. దానికి అంగీకరించింది ఆర్యమాంబ. దాన్ని ఆతురన్యాసం అని అంటారు.

 

సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తుండగానే ఆశ్చర్యంగా మొసలి శంకరులను వదిలివేసింది. శంకరులు గురువు కోసం అన్వేషణ చేస్తూ ఉత్తర భారత యాత్ర చేసే ఆలోచనలో తల్లి అనుమతి కోరుతూ ‘ప్రాతఃకాలం, రాత్రి, సంధ్యాసమయాలలో ఏ సమయంలో అయినా, స్పృహలో ఉన్నప్పుడూ, స్పృహ లేనప్పుడూ నన్ను తలచుకోగానే నీ దగ్గరికి వస్తాను అని తల్లి ఆర్యమాంబకు మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాను’ అని చెప్పారు. తల్లి దగ్గర అంగీకారం తీసుకుని శంకరులు కాలినడకన గురువు కోసం అన్వేషణలో నర్మదా నది దగ్గరికి వెళ్ళారు. నర్మదా ఒడ్డున గౌడపాదుల శిష్యుడు అయిన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం లభించింది. వ్యాసమహర్షి కుమారుడు అయిన శుకుని శిష్యులు గౌడపాదులు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరునికి అడవులనుండి నడచి వచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయి గోవింద భగవత్పాదులకు నమస్కారం అని స్తోత్రం చేయగా గోవింద భగవత్పాదులు ఎవరు నువ్వు అని అడిగారు. శంకరులు దశశ్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు.

న భూమిర్నతోయం
న తేజో నవాయుర్మఖంనేంద్రియం వా
న తేషాం సమూహః
అనైకాంతి కత్వా త్సుశుష్యైక
సిద్ధిస్తదేకోవ శిష్ట శ్శివః కేవలోహం
నేను నింగిని కాదు, భూమిని కాదు, నీటిని కాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తంగాని లేనివాడిని. నేను శివుడను, విభజనలేని జ్ఞాన సారాన్ని అటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరులను, గోవింద భగవత్పాదులు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నారు …సాక్షాత్తు భూమికి దిగివచ్చిన పరమశివుడే ఈ శంకరుడు. అటుతర్వాత శంకరులు మొట్టమొదటిసారిగా గోవిందభగవత్పాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తుంది. గురు సేవతోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి చాటి చెప్పారు.

గోవిందభగవత్పాదులు, శంకరులను బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహా వాక్యాలుగా బోధించారు. ఒక రోజు నర్మదా నదికి వరద వచ్చి పొంగి పొర్లుతూ గోవిందపాదుల తపస్సుకు భంగం కలిగించ బోతుండగా శంకరులు తన ఓంకార శక్తితో నదిని నిరోధించారు. గోవిందపాదుల దగ్గర విద్యను అభ్యసించిన తరువాత గురువాజ్ఞతో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నారు. పవిత్ర గంగానదిలో పుణ్యస్నానం చేసి, విశ్వేశ్వరుడి సన్నిధిలో కొంతకాలం గడిపారు. వేద సూక్ష్మాలు శంకరులకు వారణాసిలో బాగా అవగతం అయ్యాయి. అలా ఆయన సన్యాసదీక్ష, గురువుల దగ్గర శిష్యరికం జరిగిపోయాయి.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news