అయినవిల్లిలోని సిద్ధివినాయకుడు స్వయంభువుడు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి 12 కి.మీ. దూరంలో ఉన్న అయినవిల్లి గ్రామంలో వెలసి ఉన్న సిద్ధి వినాయకస్వామి గురించి ఆంధ్రదేశంలో తెలియని వారుండరు. ఈయన కానిపాకం వినాయకుడి కంటే ముందే ఇక్కడ కొలువై ఉన్నాడని చెబుతారు. అసలు కానిపాకం పుణ్యక్షేత్రం కావడానికి ఈ అయినవిల్లి సిద్ధివినాయకుడే కారణమని స్థలపురాణం చెబుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో నిత్యం లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తారు.
ఇక్కడకు వచ్చిన భక్తులెవరైనా రూ.300 చెల్లించి ఈ హోమంలో పాల్గొనవచ్చు. అయితే విద్యార్థుల కోసం ఏటా వార్షిక పరీక్షల ముందు ఫిబ్రవరిలో లక్ష పెన్నులతో స్వామివారికి అభిషేకం చేసి వాటిని విద్యార్థులకు అందిస్తారు. ఇలా పెన్నులతో అభిషేకం చేసి అవి విద్యార్థులకు ఇస్తే వాళ్లకు మంచి జరుగుతుంది అక్కడ నమ్మకం. అందుకే ఇక్కడ ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో స్వామివారికి పెన్నులతో అభిషేకం చేస్తారు. ఇలా పెన్నులతో అభిషేకం చేసి విద్యార్థులకు ఇవ్వడమే ఈ ఆలయం ప్రత్యేకత.
ఈ పెన్నులతో పరీక్ష రాస్తే తప్పకుండా మంచి మార్కులతో పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తామని విద్యార్థుల విశ్వాసం కూడా. విశాల ప్రాంగణం గల ఈ సిద్ధివినాయకస్వామి ఆలయ ప్రాకారంలో…అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరాలయం, శ్రీభూసమేత కేశవస్వామి ఆలయం, ఈశాన్య భాగంలో కాలభైరవస్వామి ఆలయం ఉన్నాయి. అందుకే ఈ ఆలయం పంచాయతన క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ స్వామివారిని దర్శించడానికి ఎందరో రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు కూడా రావడం ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక ఆకర్షణ.