బతుకమ్మ తొమ్మిది పేర్లు.. వాటి కారణాలు..

-

తెలంగాణ రాష్ట్ర పండగ అయిన బతుకమ్మ పండగ రానే వచ్చింది. ఆడబిడ్డల పండగగా చెప్పుకునే బతుకమ్మ పండగ తొమ్మిది రోజుల పాటు సాగుతుంది. ఈ తొమ్మిది రోజుల పాటు బతుకమ్మలన్ని పేర్చి ఆటలాడుతూ చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఐతే తొమ్మిది రోజుల పాటు సాగే ఈ బతుకమ్మ పండగకి ఒక్కో రోజున ఒక్కో పేరు ఉంటుంది. నిజానికి బతుకమ్మ పండగ అశ్వయుజ మాసం మహాలయ అమావాస్య రోజున మొదలవుతుంది. కానీ ఈ సారి అధిక మాసం రావడంతో ఒక నెల ఆలస్యంగా పండగ మొదలైంది.

ఈ రోజు నుండి తెలంగాణ అంతటా బతుకమ్మ పండగ మొదలైంది.

ఎంగిలి పూల బతుకమ్మ:

మొదటి రోజు బతుకమ్మ పండగని ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు బతుకమ్మని ఒకరోజు ముందుగా తీసుకువచ్చిన పూలతో పేర్చుతారు.

అటుకుల బతుకమ్మ:

రెండవ రోజు అటుకుల బతుకమ్మ. ఈ రోజు రంగు రంగుల పూలతో రెండు అంత్రాలు పేర్చి బతుకమ్మకి వాయినంగా అటుకులని సమర్పిస్తారు.

ముద్దపప్పు బతుకమ్మ:

మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. పూలతో మూడంత్రాలు పేర్చి వాయినంగా సత్తుపిండి, పెసర్లు, బెల్లం కలిపి పెడతారు.

నాన బియ్యం బతుకమ్మ:

నానబెట్టిన బియ్యాన్ని వాయినంగా సమర్పిస్తారు. అందుకే నాన బియ్యం బతుకమ్మగా పిలుస్తారు.

అట్ల బతుకమ్మ:

ఐదవ రోజు ఐదంతరాలలో బతుకమ్మని పేర్చి అట్లని వాయినంగా సమర్పిస్తారు.

అలిగిన బతుకమ్మ:

ఈ రోజు బతుకమ్మని పేర్చరు. పూర్వ కాలం కథ ప్రకారం బతుకమ్మ కి మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని చెబుతుంటారు. అందువల్ల బతుకమ్మ ఆడరు. అందుకే బతుకమ్మ అలిగినట్లుగా అలిగిన బతుకమ్మగా పిలుస్తారు.

వేపకాయల బతుకమ్మ:

ఏడవ రోజు బతుకమ్మని ఏడంత్రాలుగా చేసి, వాయినంగా సకినాల పిండితో వేపకాయలంత ఉండలు కట్టి నైవేద్యంగా పెడతారు.

వెన్నముద్దల బతుకమ్మ:

ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ. రంగు రంగుల పూలతో ఎనిమిది అంత్రాలుగా పేర్చి వాయినంగా నువ్వులు, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు.

సద్దుల బతుకమ్మ:

పెద్ద బతుకమ్మ అని కూడా పిలుస్తారు. ఈ రోజు అనేక రకాల పూలతో బతుకమ్మని పెద్దగా పేర్చి ఆటపాటలతో ఆడిపాడి చెరువులో నిమజ్జనం చేస్తారు. ఐతే పెద్ద బతుకమ్మతో పాటు గౌరమ్మగా చిన్న బతుకమ్మని కూడా పేర్చుతారు. చెరువులో నిమజ్జనం చేసిన తర్వాత ఆడవాళ్లందరూ పసుపు చెంపలకి పూసుకుంటారు. ఆ తర్వాత తమతో తెచ్చుకున్న సద్దులని ఆరగించి ఇంటికి తిరిగి వెళుతూ పాటలు పాడుతారు. బతుకమ్మ పాటలనే ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు కూడా పాడుతుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news