హిందువుల పండుగలు అన్ని ప్రకృతితో ముడిపడి ఉంటాయి. వాటివెనుక ప్రకృతిలోని మార్పులు, చేర్పులతో సంబంధం కలిగి ఉంటాయి. అలాంటి పండుగలలో ముఖ్యమైనది రథసప్తమి. ఇక ఈ పండుగను ఖగోళశాస్త్రం ప్రకారం చూస్తే సూర్యుని సంచారానికి సంబంధం ఉందని చెప్పవచ్చు. సూర్యుని రధానికి గుర్రాలు ఏడు. ఇవి ఇంద్రధనుస్సు లోని రంగులుగా, వారంలోని ఏడు రోజులుగా భావించవచ్చు. సూర్యుని రధచక్రాలకు గల ఆకులు పన్నెండు. వీటిని ఒక సంవత్సరం లోని పన్నెండు నెలలుగా లేదా పన్నెండు రాశులుగా భావించవచ్చును. సూర్యోదయానికి ముందు కన్పించే అరుణ వర్ణాన్నే సూర్యుని రధసారధి అరుణుడు అంటారు. ఇతనికే అనూరుడు (ఊరువులు లేనివాడు) అనే పేరు ఉంది .
సూర్యుడు ఒక్కో రాశి లోనూ లేదా ఒక్కో నెలలోను ముప్పై డిగ్రీలు చొప్పున మూడు వందల అరవై డిగ్రీలు పూర్తి చేయడానికి ఒక సంవత్సరం అంటే మూడు వందల అరవై అయిదు రోజులు పడుతుంది. అది భూమి సూర్యుని చుట్టూ ఒకసారి భ్రమణం చేయడానికి పట్టే సమయంగా గుర్తించవచ్చును. యీసమయం నుంచే ఋతువులలో మార్పులు వస్తాయి. నెమ్మదిగా ఎండలు మొదలవుతాయి. అందుకే రైతులు మరల తమ పొలం పనులలో నిమగ్నమయేందుకు సిధ్ధమవుతారు.
విజ్ఞానశాస్త్ర ప్రకారం చూస్తే సూర్యోదయ కాలంలో సూర్యుని ఎదురుగా నుంచుని స్నానం చేయడం వలన సౌరశక్తి లోని అతినీల లోహిత కిరణాలు మన శరీరంలో విటమిన్ “డి” సంశ్లేషితమవుతుంది. లేత సూర్యకిరణాలలో సూర్య నమస్కారాలు చేయడం వెనుక ఉన్న శాస్త్రీయ కోణం ఇదే.
– కేశవ