డిజిటల్ పేమెంట్స్ యాప్ మొబిక్విక్ తన యూజర్లకు శుభవార్త చెప్పింది. వడ్డీ లేకుండా రూ.10వేల వరకు రుణం అందిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు మొబిక్విక్ సంస్థ ఫైనాన్స్ అందించే హోం క్రెడిట్ అనే సంస్థతో భాగస్వామ్యం అయింది. ఈ క్రమంలో రెండు సంస్థలు ఓ సంయుక్త ప్రకటనను తాజాగా విడుదల చేశాయి. అలాగే హోం క్రెడిట్ మనీ పేరిట ఓ యాప్‌ను లాంచ్ చేశారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా అందులో రుణం పొందవచ్చు.
మొబిక్విక్‌లో రూ.1500 నుంచి రూ.10వేల వరకు వడ్డీ లేని రుణం పొందవచ్చు. ఇలా పొందిన రుణం మొబిక్విక్ వాలెట్‌లో లోడ్ అవుతుంది. అనంతరం ఆ మొత్తాన్ని యూజర్లు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఆ మొత్తంతో వస్తువులను కొనుగోలు చేయవచ్చు. లేదా బయట స్టోర్స్‌లోనూ చెల్లింపులు జరపవచ్చు.
ఇక హోం క్రెడిట్ ద్వారా తమ యూజర్లకు రూ.2.40 లక్షల వరకు రుణాలను అందజేయనున్నట్లు కూడా మొబిక్విక్ తెలియజేసింది. అయితే ఇప్పటికే మొబిక్విక్‌లో జిప్ పే లేటర్ పేరిట సౌకర్యాన్ని అందిస్తున్నారు. దాని సహాయంతో యూజర్లు వస్తువులను కొనుగోలు చేయడంతోపాటు బిల్లు చెల్లింపులు జరపవచ్చు. దీనికి తోడు హోం క్రెడిట్‌తో అందిస్తున్న లోన్ సదుపాయం ఇందులో యూజర్లకు అదనంగా లభ్యం కానుంది.