ఒక పక్క అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల్లో రాజధానిపై జరుగుతున్నచర్చ, వివాదాలు, వాగ్వాదాలతో ప్రతి న్యూస్ ఛానెల్ ఠారెత్తిపోతోంది. ఏ ఇద్దరు కలుసుకున్నా.. ఏ ఇంట్లో టీవీ ఆన్ చేసినా.. ప్రజలంతా వీటినే వీక్షిస్తున్నారు. అయితే, ఇంతలోనే మెరుపు వేగంతో ఓ వార్త మీడియా చానెళ్లను ఆకర్షించింది. అంతే వేగంగా వైరల్ కూడా అయింది. అదే నెల్లూరు జిల్లా కోవూరు వైసీ పీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సీఎం జగన్‌ను, ఆయన కుటుంబాన్ని కించపరుస్తూ.. గతాన్ని తవ్వారని, వైసీపీ నే తలను ఇరికించే ప్రయత్నం చేశారని, ఆయనలోని అసంతృప్తిని ఇలా బయటకు కక్కేశారని ఈ వార్తల సారాంశం.
అంతేకాదు, ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గం వారితో మాట్లాడినట్టున్న ఆడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం, ఇది ప్రధాన మీడియాలో ప్రచారంలోకి రావడంతో ఒక్క సారిగా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. దీంతో అ సలు ఏంజరిగింది ? అనే చర్చ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రసన్నకుమార్‌రెడ్డి గురించిన చరిత్రపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టారు. కోవూరు నియోజకవర్గంలో నల్లపరెడ్డి ఫ్యామిలీకి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది.
1989 నుంచి కూడా నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి రాజకీయాల్లో ఉన్నారు. 1989లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరి.. మంత్రి పదవిని కూడా అలంకరించారు. అనంతరం, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ తరఫున 1994, 99, 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం సాధించారు.
అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో ప్రసన్నకుమార్ రెడ్డి వైసీపీలోకి చేరిపోయారు. ఈ క్రమంలోనే 2014లో ఓడి పోయినా.. గత ఏడాది ఎన్నికలలో విజయం సాధించారు. అయితే, ఆయన మంత్రిపదవిని ఆశించారు కానీ, ఇది దక్కలేదు. దీం తో ఒకింత అసంతృప్తితో ఉన్న మాట నిజమే.
అయితే, రెండున్నరేళ్ల తర్వాత అయినా మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నా రు. ఇదిలావుంటే, త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలను చేర్చుకున్నారు. అయితే, దీనిని వైసీపీలోని కింది స్థాయి నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమం లోనే వారిని సర్ది చెప్పేందుకు ప్రసన్నకుమార్ ప్రయత్నించారే తప్ప.. జగన్‌ను విమర్శించాలనే ఉద్దేశం ఆయనకు లేదనేది ఆయన అనుచరులు వెల్లడించారు. అయితే, వైసీపీ ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించలేదని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.