ఎల్‌ఆర్‌ఎస్ కు ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలంటే..?

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్ల‌ను రిజిస్ట్రేష‌న్ చేసుకునేందుకు మ‌రోసారి అవ‌కాశం క‌ల్పించిన విష‌యం విదిత‌మే. అనుమతి లేని‌, అక్ర‌మ లే అవుట్‌ల‌లోని ప్లాట్ల‌ను ఎల్ఆర్ఎస్ కింద రిజిస్ట్రేష‌న్ చేయించుకోవ‌చ్చు. దీన్నే లే అవుట్ రెగ్యుల‌రైజేష‌న్ స్కీం అని కూడా అంటారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ (ది మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్‌) (ఎంఏ అండ్ యూడీ) తాజాగా 131 జీవోను కూడా విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం ఆగ‌స్టు 26వ తేదీకి ముందు వ‌ర‌కు సేల్ డీడ్ చేయించుకున్న అక్ర‌మ లే అవుట్‌ల‌లోని ప్లాట్ల‌కు గాను జరిమానా చెల్లించి వాటిని రెగ్యుల‌రైజ్ చేసుకోవ‌చ్చు. ఇక ఇందుకు అక్టోబ‌ర్ 15, 2020వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించారు.

how to apply for lrs in telangana

కాగా ఈ జీవో కింద ఎల్ఆర్ఎస్‌లో భాగంగా భూ య‌జ‌మానులు, ప్రైవేట్ డెవ‌ల‌ప‌ర్లు, సంస్థ‌లు, కంపెనీలు, ప్రాప‌ర్టీ డెవ‌ల‌ప‌ర్లు త‌మ ప్లాట్ల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించుకోవ‌చ్చు. నీటి ముంపు ఉన్న ప్రాంతాలు, న‌దులు, నాలాలు, కాలువ‌లు, ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోని లే అవుట్లు, ప్లాట్ల‌ను రెగ్యుల‌రైజేష‌న్ చేయ‌రు.

ఇక ప్లాట్ల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించుకునేందుకు గాను ఎల్ఆర్ఎస్‌కు ముందుగా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఇందుకు వ్యక్తులైతే రూ.1వేయి, డెవ‌ల‌ప‌ర్లు అయితే రూ.10వేలను రిజిస్ట్రేష‌న్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. మీ సేవా కేంద్రాలు, సిటిజెన్ స‌ర్వీసు కేంద్రాలు లేదా రెగ్యుల‌రైజేష‌న్ కోసం రూపొందించిన యాప్ ద్వారా కూడా ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.

ప్లాట్ రెగ్యుల‌రైజేష‌న్ కోసం 100 గ‌జాల లోపు ప్లాటుకు గ‌జానికి రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 100 నుంచి 300 గ‌జాల ప్లాటు వ‌ర‌కు గ‌జానికి రూ.400, 300 నుంచి 600 గ‌జాల ప్లాట్ల‌కు గ‌జానికి రూ.600 చొప్పున రెగ్యుల‌రైజేష‌న్ చార్జిలు చెల్లించాల్సి ఉంటుంది.

ఎల్ఆర్ఎస్‌కు ఆన్‌లైన్‌లో ఇలా ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు…

* ద‌ర‌ఖాస్తుదారులు ముందుగా https://lrsbrs.hmda.gov.in/hmdaLMS/loginpage అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి అందులో రిజిస్ట‌ర్ చేసుకోవాలి. అప్ప‌టికే రిజిస్ట‌ర్ అయి ఉంటే లాగిన్ అవ్వాలి.
* వెబ్‌సైట్‌లో రిజిస్ట‌ర్ అయ్యేందుకు ద‌ర‌ఖాస్తుదారులు త‌మ పేరు, ఫోన్ నంబ‌ర్‌, మెయిల్ ఐడీ త‌దిత‌ర వివ‌రాల‌ను ఎంట‌ర్ చేయాలి. అనంత‌రం స‌బ్‌మిట్ బ‌ట‌న్ ను క్లిక్ చేయాలి.
* ద‌ర‌ఖాస్తుదారుల ఫోన్ కు వెరిఫికేష‌న్ కోడ్ వ‌స్తుంది. దాన్ని ఎంట‌ర్ చేసి మొబైల్ నంబ‌ర్‌ను క‌న్ఫాం చేయాలి. దీంతో మొబైల్ నంబ‌ర్ యూజ‌ర్‌నేమ్‌గా ఉప‌యోగ‌ప‌డుతంది. పాస్‌వ‌ర్డ్‌ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
* ద‌రఖాస్తు దారులు సైట్‌లో యూజ‌ర్ నేమ్‌, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకున్నాక వాటిని ఉప‌యోగించి సైట్‌లో లాగిన్ అవ్వాలి.
* సైట్‌లో లాగిన్ అయ్యాక ఎల్ఆర్ఎస్‌కు అప్లై చేయ‌వ‌చ్చు.
* సైట్‌లో అందుబాటులో ఉండే ఎల్ఆర్ఎస్ అప్లికేష‌న్ ఓపెన్ చేసి అందులో ద‌ర‌ఖాస్తు దారు ప్లాట్ వివ‌రాలు, జిల్లా, మండ‌లం, గ్రామం, ప్లాట్ నంబ‌ర్‌, స‌ర్వే నంబ‌ర్‌, ప్లాట్ ఏరియా, బిల్డింగ్ ఎత్తు త‌దిత‌ర వివ‌రాల‌ను న‌మోదు చేయాలి.
* ద‌ర‌ఖాస్తుదారు ఎల్ఆర్ఎస్‌కు సంబంధించిన ప‌త్రాల‌ను సైట్‌లోకి అప్‌లోడ్ చేయాలి.
* వాటిని అధికారులు వెరిఫై చేసి ఓకే చేస్తే ప‌ని అయిపోయిన‌ట్లే.
* ద‌ర‌ఖాస్తుదారులు త‌మ ఎల్ఆర్ఎస్‌కు చెందిన అప్లికేషన్ స్టేట‌స్‌ను కూడా సైట్‌లో చెక్ చేసుకోవ‌చ్చు.

ద‌ర‌ఖాస్తుదారులు ఈ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను 15 నిమిషాల్లో పూర్తి చేయాలి. లేదంటే మ‌ళ్లీ కొత్త‌గా అప్లై చేయాల్సి ఉంటుంది. ఎల్ఆర్ఎస్ ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించ‌వ‌చ్చు. డెబిట్‌, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ స‌దుపాయాలు అందుబాటులో ఉన్నాయి. చెల్లింపులు జ‌రిపాక ర‌శీదు ఇస్తారు. ఇలా ఆన్‌లైన్‌లో ఎల్ఆర్ఎస్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news