ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. భారత్ లో గడిచిన మూడు రోజులుగా 80,000కు పైగా నమోదవుతున్న కేసులు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా కరోనా మహమ్మారి గురించి వైద్యుల పరిశోధనల్లో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. అయితే తాజాగా వైద్యులు కరోనా సోకిన రోగుల్లో డెంగ్యూ, మలేరియా వ్యాధులను గుర్తించారు. ఢిల్లీలో రెండు ఆస్పత్రుల వైద్యులు కరోనా రోగులను పరిశీలించి ఈ విషయాలను వెల్లడించారు. సాధారణంగా వర్షాకాలంలో దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వ్యాధుల విజృంభణ జరుగుతుందని అయితే కరోనా రోగులు డెంగ్యూ లేదా మలేరియా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోందని వైద్యులు చెప్పారు.
ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ డాక్టర్ రాజేష్ చావ్లా మీడియాతో మాట్లాడుతూ 30ఏళ్ల కరోనా రోగుల్లో సైతం డెంగ్యూ, మలేరియా వ్యాధుల లక్షణాలు కనిపిస్తున్నాయని… ఇలా రెండు వ్యాధుల బారిన పడిన వారిని రక్షించడం కష్టమవుతోందని తెలిపారు. ఢిల్లీ ఎయిమ్స్ ప్రొఫెసర్ ప్రగ్యాన్ ఆచార్య్ మాట్లాడుతూ ఒకే వ్యక్తికి రెండు వ్యాధులు నిర్ధారణ అయితే చికిత్స అందించడంలో వైద్యులు సతమతమవుతున్నారని… అయితే కరోనా సోకిన వారందరూ డెంగ్యూ లేదా మలేరియా బారిన పడతారని చెప్పలేమని పేర్కొన్నారు.