త్వరలో జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో 80 సంవత్సరాలు పైబడిన ఓటర్లకు, దివ్యాంగులు, 2020 నవంబర్ 1 తర్వాత కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వర్తింపజేస్తున్నట్లు జిహెచ్ఎంసి ఎన్నికల అధికారి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కేటగిరి ఓటర్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ www.tsec.gov.in లో వివరాలను పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ మాడ్యూల్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధిత రిటర్నింగ్ అధికారులు, డిప్యూటీ కమిషనర్లు పోస్టల్ బ్యాలెట్ ను వారి వారి చిరునామాలకు పంపిస్తారని జిహెచ్ఎంసి ఎన్నికల అధికారి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. వికలాంగులు, వయోధికులకు పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు, ర్యాంపులు, వీల్ చైర్ లు ఏర్పాటు కూడా చేస్తున్నారు. వృద్ధులు, పసి పిల్లల తల్లులు, వికలాంగులు క్యూలైన్ తో సంబంధం లేకుండా నేరుగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. డిసెంబర్ 1 వ తేదీ ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ సాగనుంది.