పనస పండు ఆకారంలోనే కాదు ఉపయోగంలో కూడా పెద్దదే. వేసవిలో ఎక్కువగా లభించే పనసలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్ల మంచి ఆరోగ్యాన్నిస్తుంది. పనస తొనలు మాత్రమే కాక పనసపొట్టు కూర లో చాలా పోషకాలు ఉన్నాయి. మరి దీనిని ఎలా తయారు చేయాలో చూద్దాం.
పనసపొట్టు పొడికూర కు కావలసిన పదార్థాలు: పనస పొట్టు 1 కప్పు, పెసర పప్పు ½ కప్పు, నూనె 3 స్పూన్లు, కరివేపాకు, 4 ఎండు మిర్చి, 5 పచ్చి మిర్చి, పోపు గింజలు 1 స్పూన్, అల్లం ,ఇంగువ, సరిపడా ఉప్పు, పసుపు, కారం.
తయారీ విధానం: స్టవ్ వెలిగించి తగినన్ని నీళ్ళు పోసి పనసపొట్టుని ఉడికించాలి. పెసరపప్పులో తక్కువ నీరు పోసి పలుకుగా ఉడికించుకోవాలి. పొట్టు కూడా బిరుసుగా ఉండగానే నీరు వంచి తడి పిండుకోవాలి. పిండిన పొట్టుని ఉడుకుతున్న పెసర పప్పు మీద వేసి ఉప్పు, పసుపు, కారం, ఇంగువ కలపాలి. ఇప్పుడు వేరే స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తరువాత పోపు గింజలు, కరివేపాకు, ఎండు మిర్చి వేయించాలి. పోపు వేగిన తరువాత పనస పొట్టుని అందులో వంపి పొడిగా ఉండే వరకు ఉంచి దించుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన పనసపొట్టు పొడి కూర రెడీ.
పోషక విలువలు: కేలరీస్ 157, ప్రోటీన్ 2.84 గ్రా, కొవ్వు 1.06గ్రా, కార్బోహైడ్రేట్స్ 38.36గ్రా, పైబర్ 2.5 గ్రా, షుగర్స్ 31.48 గ్రా, విటమిన్ సి 22.6 మి గ్రా, పొటాషియం 739మి గ్రా, మెగ్నీషియం 48 మి గ్రా.