ప్రస్తుత తరుణంలో ఏ ఆహార పదార్థాన్నితీసుకున్నా కల్తీ అయిపోతోంది. నాణ్యమైన ఆహారం మనకు లభించడం లేదు. ఇక కూరగాయలు, పండ్ల విషయానికి వస్తే.. ఎక్కువగా పురుగు మందులు వేసి పండించినవే ఉంటున్నాయి. దీంతో వాటిని కొని ఇంటికి తీసుకువచ్చి వండాక కూడా వాటిల్లో ఇంకా క్రిమి సంహారక మందుల అవశేషాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో వాటిని తినడం వల్ల మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కానీ వాటిని తినక తప్పదు కదా.. అయితే మరేం చేయాలి..? సదరు అవశేషాలు కూరగాయలు, పండ్లలో ఉండకుండా ఏమీ చేయలేమా..? అంటే.. చేయవచ్చు.. అందుకు ఉపాయం ఉంది.. అదేమిటంటే…
కూరగాయలు, పండ్లలో ఉండే క్రిమి సంహారక మందులకు చెందిన అవశేషాలను తొలగించుకోవాలంటే కింద సూచించిన రెండు పద్ధతుల్లో దేన్నయినా పాటించవచ్చు. దీంతో ఆ అవశేషాలు తొలగిపోతాయి. శుభ్రమైన పదార్థాలను తినేందుకు అవకాశం ఉంటుంది. అనారోగ్యాలు రాకుండా చూసుకోవచ్చు. ఇక ఆ రెండు పద్ధతులు ఏమిటంటే…
* ఒక పెద్ద పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేయాలి. అనంతరం ఆ నీటిలో కూరగాయలు లేదా పండ్లను వేసి 5 నుంచి 10 నిమిషాల పాటు వాటిని నానబెట్టాలి. ఆ తరువాత ఆ నీటి నుంచి వాటిని తీసి చల్లని నీటితో కడిగి శుభ్రపరచాలి. దీంతో కూరగాయలు, పండ్లలో ఉండే క్రిమి సంహారక మందుల అవశేషాలు చాలా వరకు తొలగిపోతాయి.
* పైన తెలిపిన మిశ్రమంలో ఉప్పుకు బదులుగా వెనిగర్ వాడవచ్చు. నీటిలో వెనిగర్ కలిపి ఆ మిశ్రమంలో కూరగాయలు, పండ్లను కొంత సేపు ఉంచాలి. ఆ తరువాత వాటిని తీసి పైన తెలిపిన విధంగానే చల్లని నీటితో వాటిని కడగాలి. దీంతో వాటిల్లో ఉండే రసాయన మందుల అవశేషాలు పోతాయి. ఇలా వాటిని శుభ్రం చేసుకుని తింటే అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి.