భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి యాలకులను తమ వంటి దినుసుగా ఉపయోగిస్తున్నారు. వీటిని చాలా మంది నిత్యం వంటల్లో వేస్తుంటారు. కొందరు యాలకులను నేరుగా అలాగే వంటల్లో వేస్తే.. కొందరు వాటిని పొడి వేస్తారు. అలాగే కొందరు వీటిని స్వీట్లలోనూ వేస్తుంటారు. దీంతో ఆయా వంటకాలకు చక్కని వాసన, రుచి వస్తాయి. అయితే ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం యాలకులు మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తాయి. వాటిల్లో అధిక బరువును తగ్గించుకోవడం కూడా ఒకటి.
యాలకుల్లో ఉండే ఔషధ గుణాలు శరీర మెటబాలిజంను పెంచుతాయి. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. శరీరంలో అధికంగా ఉన్న నీరు బయటకు వెళ్లిపోతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. హైబీపీ తగ్గుతుంది. మరి ఇందుకు యాలకులను నిత్యం ఎలా వాడాలంటే…
1. యాలకులతో తయారు చేసే టీని నిత్యం 3 పూటలా తాగడం వల్ల శరీరంలో అధికంగా చేరే ఆమం తగ్గిపోతుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. అధిక బరువు తగ్గుతారు.
2. యాలకుల పొడిని నిత్యం తీసుకోవడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు చేరకుండా ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. సాధారణంగా ఈ కొవ్వు వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే యాలకుల పొడిని నిత్యం తీసుకుంటే ఆ కొవ్వు పేరుకుపోదు. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే ఆయా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
3. యాలకుల పొడి సహజసిద్ధమైన డై యురెటిక్‌గా పనిచేస్తుంది. అంటే.. ఈ పొడిని తీసుకోవడం వల్ల శరీరంలో అదనంగా ఉండే నీరు బయటకు వెళ్లిపోతుంది. దీంతో బరువు తగ్గుతారు. ఈ పొడిని తీసుకుంటే శరీరంలో ఉండే అదనపు నీరు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. ఈ క్రమంలో బరువు తగ్గుతారు.
4. శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోతే డయాబెటిస్, గుండె జబ్బులు వస్తాయి. అయితే నిత్యం యాలకులను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనలో వెల్లడైంది.
5. జీర్ణశక్తి తక్కువగా ఉండేవారిలో ఆహారం సరిగ్గా జీర్ణం కాక అది కొవ్వుగా మారే అవకాశం ఉంటుంది. కనుక జీర్ణశక్తిని పెంచడం ద్వారా ఆహారం అలా కొవ్వుగా మారకుండా చూసుకోవచ్చు. దీనికి గాను యాలకులు సహాయం చేస్తాయి. నిత్యం వాటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. అధికబరువు పెరగకుండా ఉంటారు.
యాలకుల పొడిని నిత్యం టీ, కాఫీల్లో లేదా తినే ఆహారంలో తీసుకుంటే ఫలితం ఉంటుంది.