మహారాష్ట్ర ముంబయిలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్సీ). 50 కేజీల మెఫెడ్రోన్ అనే మత్తు పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. ముంబయి గౌడౌన్లో అంతర్జాతీయ మార్కెట్‌పై దాడులు చేసిన అధికారులు.. 50 కేజీల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ.120 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా మాజీ పైలట్‌తో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
మరోవైపు.. ముంబయి విమానాశ్రయంలో 16 కేజీల హెరాయిన్ పట్టుబడింది. డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు.. మలావి నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి రూ.100 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మలావి నుంచి ఖతర్ మీదుగా ముంబయి వస్తున్న ఓ ప్రయాణికుడు అక్రమంగా మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్నాడన్న సమాచారంతో డెరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్టులో ఓ అనుమానితుడిని పట్టుకుని తనిఖీ చేయగా అతడి ట్రాలీ బ్యాగ్‌లో 16 కేజీల హెరాయిన్ దొరికింది. ఈ హెరాయిన్ విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఘనాకు చెందిన మరో మహిళను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.