ఇంటికి దీపం అమ్మాయి అనే నినాదంతో ఆడపిల్లల భవిష్యత్‌కు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర సర్కార్ సుకన్య మహామేళాకు శ్రీకారం చుట్టించింది. ఇది చిన్నమొత్తలా పొదుపు పథకం. ఆడపిల్లలకు మాత్రమే వర్తించే ఈ పథకం ద్వారా అమ్మాయిలకు 21 ఏళ్లు వచ్చే వరకు వారి చదువు, వివాహం వంటి అవసరాలకు ఉపయోగపడే విధంగా రూపొందించిన పథకం ఇది.
తెలంగాణలో ‘సుకన్య మహామేళా’ పథకానికి భారీ స్పందన వచ్చింది. మూడు రోజులపాటు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పథకం కింద ఏకంగా 34,384 ఖాతాలను తెరిచారు. 28,970 లక్ష్యంగా పెట్టుకుంటే.. 118.69 శాతం తెరుచుకున్నాయని తపాలాశాఖ హైదరాబాద్ రీజియన్ సహాయ సంచాలకులు ఎం.సంతోష్‌కుమార్ నరహరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలోని 6208 తపాలా కార్యాలయాల ద్వారా ఈ లక్ష్యాన్ని అధిగమించామని వివరించారు.
హైదరాబాద్ రీజియన్‌లో 23,652.. హైదరాబాద్ హెడ్‌క్వార్టర్స్ రీజియన్‌లో 10,372 సుకన్య ఖాతాలు తెరిచారు. ఖమ్మం డివిజన్ 4,266 ఖాతాలతో మొదటి స్థానంలో నిలవగా.. తర్వాతి స్థానాల్లో సికింద్రాబాద్ డివిజన్ (3,858), కరీంనగర్ డివిజన్ (3,503), హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్ (2,629), నల్గొండ డివిజన్‌లో 2,239 నిలిచాయి.